ఆర్టీసీకి గతేడాది కంటే సగం తగ్గిన ఆదాయం
- ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ
- భక్తులకు భద్రత, సౌకర్యాల కల్పనకు తొలి ప్రాధాన్యం
- వైద్యశిబిరం, మంచినీరు ఏర్పాటు
కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 22 : ములుగు జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారక్క జాతరకు భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ విజయవంతమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా డివిజనల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాట్లు చేయడంలో సఫలమైంది. ఈ నెల 16, 17, 18, 19వ తేదీల్లో మేడారం జాతర జరిగింది. భక్తులు ముందస్తుగానే జాతరకు పయనమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సంస్థ ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేసింది. కొత్తగూడెం డిపో నుంచి 71, భద్రాచలం నుంచి 20, మణుగూరు నుంచి 25 బస్సులను జాతరకు ఆపరేట్ చేశారు.
ప్రమాదరహిత ప్రయాణం
మేడారం జాతర సమయంలో ఒక్క ప్రమాదం కూడా చోటుచేసుకోకుండా డివిజన్‌లో మొత్తం బస్సులను ఆపరేట్ చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విశేష కృషి చేశారు. బస్సులను నడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు జాగ్రత్తలు సూచించారు. రూట్ వివరాలను తెలుపుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించారు. బస్సు క్షేమంగా మేడారం చేరిందా? లేదా? అనే విషయాలపై దృష్టిసారించారు. మేడారం నుంచి తిరుగుప్రయాణమైన బస్సులు కండీషన్ తనిఖీ చేసి చిన్నచిన్న రిపేర్లను వెంటనే చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను యథావిధిగా నడిపారు. దీంతో భక్తులు బస్సుల కోసం ఇబ్బందిపడిన సందర్భం, ప్రమాదం జరిగిన సంఘటన మచ్చుకైనా కనిపించలేదు.
భక్తులకు ఉచిత వైద్యశిబిరం, మంచినీటి సరఫరా
ఆర్టీసీ అధికారులు జాతరకెళ్లే భక్తుల కోసంబస్టాండ్ ఆవరణలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మందులను వైద్యశా ఖాధికారులు ఉచితంగా అందజేశారు. వైద్యుల సలహా మేరకు భక్తులు తమవెంట మందులను తీసుకెళ్లి ఆరోగ్యాన్ని కాపా డుకున్నారు. అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలోని యువకులు బస్టాండ్ ఆవరణలో మంచినీటిని పంపిణీ చేశారు. బస్సులను ఆపరేట్ చేయడం, భక్తులకు వైద్యసౌకర్యాలు, మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అమ్మవార్లను దర్శించుకొని తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.