ఆర్టీసీకీ ఆదాయం తెచ్చిన మేడారం
వరంగల్ రీజియన్‌లో భారీగా రాబడి
వరంగల్,ఫిబ్రవరి 26(జనం సాక్షి): మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సారి ఊహించని విధంగా గణనీయంగా ఆదాయం పెరిగింది. రెండేళ్లకోసారి జరుగుతున్న మేడారం జాతరకు భక్తులను ఆర్టీసీ సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. జాతర
భక్తులను తరలించడంలో ప్రజల మెప్పు పొందుతూ ఆదాయాన్ని పెంచుకున్నది. ఈ ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరకు రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ మెరుగైన సేవలు అందించింది. వారం రోజులపాటు రాత్రింబవళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థ భక్తులను చేరవేసింది. వరంగల్ ,ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి రీజియన్ల నుంచి వేల బస్సులు మేడారం జాతరక రాకపోకలు కొనసాగించాయి.
ప్రతి జాతరలో వరంగల్ రీజియన్ నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్`1, వరంగల్`2, హన్మకొండ, భూపాలపల్లి, తొర్రూర్, మహబుబాబాద్, జనగాం, నర్సంపేట, పరకాల డిపోల నుంచి హన్మకొండ, కాజీపేట, వరంగల్ కూరగాయాల మార్కెట్, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, కొత్తగూడ, పరకాల, చిట్యాల, మహబుబాబాద్, భూపాలపల్లి, ములుగు ఘన్‌పూర్, కాటారం, సిరోంచ, కాలేశ్వరం, తొర్రూర్, వర్ధన్నపేట, నార్లాపూర్, పస్రా పాయింట్ల నుంచి వరంగల్ రీజియన్ నుంచి రాత్రి పగలు భక్తులను గమ్యస్థానాలకు చేరవేశాయి.
గత జాతరకంటే ఈసారి బస్సులలో ప్రయాణించిన భక్తుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. మొత్తానికి మేడారం జాతర పేరుతో ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు ఆదాయం గణనీయంగా పెరిగింది. జాతర జాతరకు ఆదాయం పెంచుకోవడంలో వరంగల్ రీజియన్ అధికారులు , సిబ్బంది శక్తివంచన లేకుండా పనిచేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి జాతరతో ఆర్టీసీ సంస్థకు భారీగా ఆదాయం రావడం వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.