ఆర్టీసీలో సమ్మె హారన్‌


చర్చలు విఫలం
రాత్రి నుంచే బస్సులు బంద్‌
ఈయూ, టీఎంయూ
హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) :
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె హారన్‌ మోగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత బస్సులు బంద్‌ చేస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ప్రకటించాయి. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపాయి. వేతన సవరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామన్న యాజమాన్యం హామీని తాము అంగీకరించలేదన్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. సమ్మె విరమణకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలేవి ఫలించలేదు. సంస్థ యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైన స్పందన రాలేదని కార్మిక నేతలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ హామీ మేరకు యాజమాన్యం రూపొందించిన ఎంవోయూ తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. వేతన సవరణను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలన్న తమ డిమాండ్‌పై సానుకూల స్పందన రాలేదన్నారు. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు మూడేళ్ల నిబంధన తొలగించాలని డిమాండ్‌ చేశారు. అయితే, యాజమాన్యం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మూడేళ్ల సర్వీసు పూర్తయిన కార్మికులను క్రమబద్ధీకరిస్తామని నిన్నటివరకూ చెప్పిన అధికారులు కొత్త మెలిక పెట్టారు. వీరిలో కొంత మందినే పర్మిట్‌ చేస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కార్మిక నేతలు తోసిపుచ్చారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. చర్చలకు విలువ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్లు సర్వీసు పూర్తయిన కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో కార్మికులు సమ్మె తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) కూడా మద్దతు పలకింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలకు పైచిలుకు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.