ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
` ఏకగ్రీవ ఎన్నిక
శ్రీనగర్(జనంసాక్షి): జమ్మూకశ్మీర్ లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు నేషనల్ కాన్ఫరెన్స్` కాంగ్రెస్ కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టాయి.ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడిరచారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ` కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఫలితాల్లో ఒక్క ఎన్సీనే 42 సీట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా ఎన్సీకి నలుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్సీ కూటమి బలం 46 నుంచి 50కి పెరిగింది. కాంగ్రెస్ మద్దతు లేకపోయినా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉంది. మరోవైపు.. 29 స్థానాలు గెలుచుకున్న భాజపాకు.. ముగ్గురు స్వతంత్య్ర ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కాగా.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దాదాపు ఖరారయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర హోదా డిమాండ్ తొలి క్యాబినెట్ తీర్మానమని ఆయన తెలిపారు. అయితే.. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనే దానిపై స్పష్టత లేదు. ఎన్సీ`కాంగ్రెస్ కూటమి నేతలు సమావేశంలో ప్రమాణ స్వీకారంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అయితే.. అక్టోబరు 11 లేదా 12 తేదీల్లో ఒమర్ అబ్దుల్లా సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు విూడియా కథనాలు పేర్కొన్నాయి.