ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైల్లో ఉండి, ఇటీవలే బయటికి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయిబాబా 10 రోజుల కిందట నిమ్స్ లో చేరారు. అయితే, రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారు.

సుదీర్ఘకాలం జైల్లో ఉన్న సాయిబాబా గత మార్చి 7వ తేదీన నిర్దోషిగా నాగపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా ఆయనకు గుర్తింపు ఉంది.

మావోయిస్టు ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనను గతంలో అరెస్ట్ చేశారు. గడ్చిరోలి ట్రయల్ కోర్టు సాయిబాబాతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2017 నుంచి 2024 మార్చి 6 వరకు ఆయన జైలు జీవితం గడిపారు.

కన్నీటి జోహార్లు
ప్రజలను అన్ని విధాలుగా దోపిడీ పీడనలకు గురిచేస్తున్న రాజ్యం క్రూర స్వభావాన్ని ప్రజలకు విప్పిచెప్పినందుకు నిన్ను నిర్బంధించిన సర్కార్ వాడి బానిస వ్యవస్థలు నీ పట్ల కాటిన్యాన్ని ప్రదర్శించాయి. నిర్దయగా , నిన్ను చిత్రహింసల కొలిమిలో మాడ్చివేయ జూసింది. నిత్య తేజోవంతమైన చైతన్య దీపికలా ప్రపంచమంతటా ప్రసరించావు. నీ భౌతిక వైకల్యాన్ని అడ్డుపెట్టుకుని నిన్ను వేదించాలనుకున్న మనువాద మూకలను నీ సిద్దంతభూమికతో కూడా మనో నిబ్బరంతో వాళ్ళనే భయపెట్టావు. నిజం.. నిన్ను చూసి ఈ మనువాద రాజ్యం భయపడింది. గడగడ వణికిందని చెప్పడం న్యాయంగా ఉంటుంది. ప్రగతిశీల శక్తుల మీద పగబట్టి వెంటాడి వేటాడిన రాజ్యాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని బాధితులకు ఇచ్చిన దీశాలివి నువ్వు. ప్రపంచవ్యాప్తంగా మోహరించిన యావత్ మనువాద మూకలు నిన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు కానీ నిన్నేమీ చెయ్యలేక సాగిల పడ్డారు. ప్రజల పట్ల , ప్రజా పోరాటాల పట్ల , విప్లవం పట్ల నీ గుండెలో నిక్షిప్తమైన ప్రేమాభిమానాలను విశ్వాసాన్ని చూసి వాళ్ళ గుండెలు జారిపోయుంటాయి. మనువాద రాజ్యం మొఖాన జాడించి ఒక తన్ను తన్ని.. నిండు గర్వంతో వెళ్ళిపోయావా డియర్ సాయి. 😪 విప్లవోద్యమ చరిత్రలో నీవొక విలువైన అధ్యాయం. అదెంతో విలువైన సంపద మాకు.అందుకు మేము నీకెప్పటికి రుణపడి ఉంటాము. నీ రుణాన్ని తీర్చుకునే పనిలో నిత్యం నిమగ్నమై ఉంటాము.