ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
జనగామ,ఫిబ్రవరి23(జనం సాక్షి): కరోనా కష్టకాలంలో కొవిడ్‌ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్న ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బుధవారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లను పాలకుర్తిలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో 520 మంది ఆశా కార్యకర్తలందరికి స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలో మొదటగా కనిపించే ఆరోగ్య సిబ్బంది ఆశ కార్యకర్తలు. కరోనా సమయంలో వారి సేవలు అమోఘం అన్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేని స్థితిలో..ఆశాలు పట్టించుకుని కాపాడిన ఘనత వారి సొంతమన్నారు.
100శాతం వ్యాక్సినేషన్‌ ను పూర్తి చేసిన రికార్డు కూడా వారికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాక ముందు ఆశాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ వారి జీతాలను పెంచి ఆదుకున్నారన్నారు. అందరికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శివ లింగయ్య, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.