ఆహార భద్రత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) :
ఆహార భద్రత పథకం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సంతకం చేశారు. దీంతో తక్షణమే ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు పరిమితమైనా.. ఆర్నెల్లలో దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఆహార భద్రత బిల్లు పార్లమెంట్‌లో ఉండగానే, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. 2004 ఎన్నికల సమయంలో పేద, మధ్యతరగతి వర్గాలకు అత్యంత తక్కువ ధరకే ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని, ఇందుకోసం ఆహార భద్రత చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. 2009 ఎన్నికల్లోనూ ఇదే హామీతో గెలిచిన యూపీఏ సర్కారు ఈ మేరకు బిల్లును రూపొందించింది. గత బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని మన్మోహన్‌సింగ్‌ సర్కారు విశ్వ ప్రయత్నం చేసింది. అయితే, యూపీఏ సర్కారుపై వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలపై ప్రతిపక్షాలు సభను స్తంభింపజేయడంతో ఆ అవకాశం లేకుండాపోయింది. అయితే, 2014 ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు కురిపిస్తాయని భావించిన ప్రభుత్వం… తక్షణమే ఆహార భద్రతా పథకాన్ని అమల్లోకి తేవాలని భావించింది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలా? లేక ఆర్డినెన్స్‌ తీసుకురావాలా? అన్న దానిపై కొంతకాలంగా సంధిగ్ధతలో పడిన ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేవాలని రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా ప్రతిపాదనలతో రూపొందించిన ఆర్డినెన్స్‌ను గురువారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్‌ ఆమోదం కోసం పంపించింది. సదరు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పథకం అమల్లోకి వచ్చినా.. పార్లమెంట్‌ ఉభయ సభలు చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన ఆరు వారాల్లోపు పార్లమెంట్‌ ఆమోదం పొందకుంటే, అది రద్దయిపోతుంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మూడింట రెండొంతుల జనాభా (దాదాపు 64 శాతానికిపైగా) లబ్ధి చేకూరుతుంది. ఆహార భద్రత పథకం వల్ల అత్యంత తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు రూ.3కు కిలో చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కు కిలో చొప్పున గోధుమలు, రూపాయికే కిలో చొప్పున తృణధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ పథకం కోసం రూ.1.25 లక్షల కోట్లు సబ్సిడీ భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార పథకంగా ఇది నిలిచిపోనుంది.