ఇంగ్లాండ్‌కు శ్రీలంక షాక్‌- ఆసీస్‌ చేతిలో పాక్‌ చిత్తు

– సౌతాఫ్రికా మహిళలపై న్యూజిలాండ్‌ ఘనవిజయం
ముంబై,ఫిబ్రవరి 1 : మహిళల ప్రపంచకప్‌లో రెండోరోజు సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు శ్రీలంక జట్టు షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఒక వికెట్‌ తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్‌ వుమెన్‌ టీమ్‌ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌ విఫలమవడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ నిదానంగా సాగింది. అయితే మిడిలార్డర్‌ ప్లేయర్స్‌ రాణించడంతో కోలుకుంది. జెన్నీ గన్‌ 52 , జోన్స్‌ 41 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 238 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక మహిళల జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. జయంగాని , యశోదా మెండిస్‌ తొలి వికెట్‌కు 103 పరుగుల పార్టనర్‌షిప్‌ నమోదు చేశారు. జయంగాని 62 , మెండిస్‌ 46 పరుగులకు ఔటయ్యాక… మిడిలార్డర్‌ తడబడింది. అయితే కౌషల్య నిదానంగా ఆడుతూ రన్‌రేట్‌ పడిపోకుండా జాగ్రత్త పడింది. దీంతో విజయంపై ఆశలు నిలిచాయి. చివరి ఓవర్లలో టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా… కౌషల్య క్రీజులో ఉండడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఆఖరి ఓవర్‌లో ఆమె రనౌటవడం మరింత టెన్షన్‌ నెలకొంది. ఈ పరిస్థుతుల్లో వికెట్‌ కీపర్‌ సురంగిక ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందిం చింది.  ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌పై శ్రీలంకకు ఇదే తొలి విజయం.మరో మ్యాచ్‌లో ఆస్టేల్రి యా మహిళల జట్టు , పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. బౌలర్లు ఆధి పత్యం కనబరిచిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 175 పరుగులకు ఆలౌటైంది. ఓపెన ర్లు హేన్స్‌ 39 , సారా క్యోట్‌ 35 పరుగులతో రాణించారు. తక్కవ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ మహిళల జట్టు 84 పరుగులకే కుప్పకూలింది. బిస్మా మరూఫ్‌ తప్పించి మిగిలిన వారంతా పూర్తిగా విఫలమయ్యారు. జట్టులో కేవలం ఇద్దరే రెండంకెల స్కోర్‌ నమోదు చేశారు. దీంతో పాక్‌ జట్టు 91 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మరో మ్యాచ్‌లో న్యూజి లాండ్‌ 150 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ మహిళల జట్టు డివైన్‌ సూపర్‌ సెంచరీతో భారీస్కోర్‌ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన డివైన్‌ 13 ఫోర్లు , 6 సిక్సర్లతో 145 పరుగులు చేసింది. అటు ఓపెనర్‌ బేట్స్‌ 72 , బ్రౌన్‌ 40 పరుగులు చేయడంతో కివీస్‌ 50 ఓవర్లలో 320 పరుగుల స్కోర్‌ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సఫారీ టీమ్‌ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. 41 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది.