ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ

* గ్రామాల్లో పండుగ వాతావరణం

జూలూరుపాడు, ఆగష్టు 13, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే మండల పరిధిలో మండల అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా ప్రజా భాగస్వామ్యంతో 2కె రన్, ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల పాలక మండలి సభ్యులు కలిసి ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పల్లెల్లో ప్రతి ఇంటి ముందు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. ఇంతే కాక గ్రామాల్లో పంచాయతీ పాలక మండలితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా స్వచ్చందంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం. గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొనటంతో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. గ్రామాల్లోని అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు కూడా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, చిన్నారులు సైతం వేడుకల్లో పాల్గొంటూ దేశ భక్తిని చాటుకుంటున్నారు. పలు గ్రామ పంచాయతీల కార్యాలయ భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలపై జాతీయ జెండా ఎగురుతోంది. మరి కొన్ని కార్యాలయ భవనాలను మూడు రంగులతో విద్యుత్ దీపాలంకరణ చేయటంతో రాత్రి సమయంలో కొత్త అందాలను సంతరించుకున్నాయి. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు, ఎస్సై గణేష్, తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు, ఎంఈవో వెంకట్ పలు శాఖల మండల అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నారు.