ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా అడ్లీ మహమూద్‌


గృహ నిర్బంధంలో మొర్సీ
గద్దె దించిన సైన్యం
కైరో, జూలై 4 (జనంసాక్షి) : ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మహమూద్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీని సైన్యం గద్దె దింపిన నేపథ్యంలో గురువారం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మోర్సీ మద్దతుదారులకు, ఇతరులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు అల్‌ జజీర చానల్‌ వెల్లడించింది. పదవీచ్యుతుడైన మోర్సీ రక్షణ శాఖ కస్టడీ, గృహనిర్బంధంలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడు మోర్సీని బుధవారం పదవీచ్యుతుడిని చేసిన సైన్యం.. తాత్కాలిక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మహమూద్‌ మన్సూర్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలు జరిగి, నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ మన్సూర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని సైన్యం ప్రకటించింది. ఈజిప్టు ప్రజల పోరాటంతో అధికార మార్పిడి జరిగిన అనంతరం 2012లో ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల తర్వాత జస్టిస్‌ మన్సూర్‌ హైకానిస్టిట్యూషన్‌ కోర్టు అధిపతిగా నియమితులయ్యారు. మరోవైపు, ఈజిప్టులో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ఈజిప్టు సైన్యానికి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్‌ ముర్సీని పదవి నుంచి తప్పించడమే కాకుండా దేశంలో రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయం ఆందోళన కలిగిస్తోందని ఒబామా పేర్కొన్నారు. ముర్సీ, ఆయన మద్దతుదారలను నిరంకుశంగా అరెస్టు చేయడం తగదని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు.