ఉచిత బీమా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే
– రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి
వికారాబాద్, మే17(జనం సాక్షి) : రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళితో ముందుకు సాగుతున్నారని, జూన్ నుంచి ప్రతి రైతుకు ఉచిత బీమా చేస్తున్నఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని పెద్దెముల్ మండలంలోని తట్టెపల్లిలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొని రైతులు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. మొత్తం 1,711 మంది రైతులకు రూ. 2 కోట్ల 30 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతాంగం సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. 58.33 లక్షల మంది రైతాంగం అభ్యున్నతికి రూ. 12 వేల కోట్లతో రైతుబంధు పథకం అమలు పరుస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎకరాకు ఏటా రెండు
పంటలకు రూ. 8 వేల పెట్టుబడి.. లక్షలాది ఎకరాకు సాగునీరుతో పాటు మద్దతు ధరలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు రూ. 5 లక్షల ఉచిత బీమా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
————————————–