ఉత్తరాఖండ్‌కు రూ.50 కోట్ల సాయం

పునరావాసానికి మరో రూ.10 కోట్లు
కిరణ్‌ సర్కారు ఉదారం
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం
హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :
ప్రకృతి బీభత్సం, జలప్రళయంతో కకావికలమైన ఉత్తరాఖండ్‌ను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌కు రూ.50 కోట్ల ఆర్థిక సహాయన్ని ప్రకటించింది. అలాగే, పునరావాసాల కోసం రూ.10 కోట్లు అందించనుంది. వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ఉదార సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత తెలిపింది. ఉత్తరాఖండ్‌ను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో వరదలు పోటెత్తడంతో కనీవినీ ఎరుగని భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన లక్షకు పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. వారిలో లక్ష మందిని సైన్యం సురక్షితంగా తరలించినప్పటికీ, ఇంకా వరదల్లో చిక్కుకున్న వారి వేల సంఖ్యలోనే ఉంది. మరోవైపు, ఇప్పటివరకు 3 వేల మంది ఆచూకీ లభించలేద. వేల సంఖ్యలో మృతి చెందారు. మృతదేహాల వెలికితీత తీవ్ర ఇబ్బంది మారింది. భారీ వర్షాలకు బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి సహా గౌచర్‌, గౌరీకుండ్‌, హర్సిల్‌ తదితర జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. జనజీవనం స్తంభించింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సమాచార, రవాణా వ్యవస్థ దెబ్బతింది. భారీగా నష్టపోయిన ఉత్తరాఖండ్‌ను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరద బాధిత రాష్టాన్రికి రూ.50 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, సహాయ, పునరావాస కేంద్రాల కోసం మరో రూ.10 కోట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా యాత్రికుల వసతి కల్పనకు రూ.40 కోట్లు కేటాయించనున్నారు. అలాగే, ఇటీవల ప్రాణాలో కోల్పోయిన జవాన్లు యాదయ్య, వినాయకం కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య గత వారం కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డాడు. ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన జవాను వినాయకం, కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో కన్నుమూసిన యాదయ్య కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇంటి స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు.