ఉత్తుత్తి ఢిల్లీ యాత్రలు వద్దు
మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వండి
హరీశ్ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18(జనంసాక్షి):
మంత్రులు ఉత్తుత్తి ఢిల్లీ పర్యటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు..కేంద్రం తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంటే మంత్రులు ఢిల్లీ టూర్లు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మంత్రులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను ఇలాగే సాగదీస్తే మంత్రులు తెలంగాణలో అడుగుపెట్టలేరన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. గురువారంనాడు టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదా యలను ప్రభుత్వం అగౌరవ పరుస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలను ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనిఅన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సమాచార శాఖ మంత్రిగా డి.కె. అరుణ ఉన్నా దసరా, బతుకమ్మ పండుగలపై ప్రభుత్వం ఎక్కడా ప్రకటనలు చేయించడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు మహిళా మంత్రులు ఉన్నా బతుకమ్మ పండుగపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యంగా దసరా, బతుకమ్మ పండుగకు ప్రత్యేక సెలవులను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగలో తెలంగాణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు సక్రమంగా పాల్గొనలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ పది జిల్లాలకు కలిపి బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకునేందుకు ప్రభుత్వం పదిలక్షల రూపాయలు విడుదల చేయడం సరికాదని అన్నారు. జిల్లాలో ఒక గ్రామానికి కూడా వందరూపాయలు కూడా వచ్చేలా లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన పదిలక్షల రూపాయలు ఏ మాత్రం సరిపోవని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంత పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని హరీష్ డిమాండ్‌చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు కార్యచరణను రూపొందిస్తున్నట్లు హరీష్ తెలిపారు. తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఉద్యమాలతోనే గుణపాఠం చెబుతామని అన్నారు. ప్రధాని పాల్గొన్న జీవవైవిధ్య సదస్సులో కవరేజికి వెళ్ళిన తెలంగాణ మీడియా పట్ల ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ను తరిమి కొడతారని హరీష్‌రావు హెచ్చరించారు.