ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి):
పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. శనివారం నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో తెలంగాణ ఎంఈవోల కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ పదో పీఆర్సీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 19న ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. డీఎస్సీలో జరిగిన తప్పులను సవరించి విధంగా చర్యలు తీసుకోవాలని, 610 జీవోలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన డీఈవోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో ఇటీవల చేసిన సంస్కరణలు స్థానికతకు పాతరేసే విధంగా ఉందని, నాన్‌గెజిటెడ్ పోస్టులను గ్రూప్ 1 పోస్టులుగా మార్చడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమలక్కపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశంలో అన్ని పార్టీలు ఒకే వైఖరి చెప్పేలా ఒత్తిడి తేవాలని, ఇందుకోసం 16 నుంచి 23 వరకు ములాకత్ నిర్వహించేందుకు కార్యవర్గం నిర్ణయించిందన్నారు. అలాగే జనవరి 5 నుంచి మార్చి 31 వరకు అన్ని జిల్లాల ఉద్యోగులు ఉద్యమాలు చేపట్టాలని కోరారు. టీఎన్‌జీవో కేంద్ర సంఘం అసోసియేటెడ్ అధ్యక్షుడిగా సురేశ్‌కుమార్ (సచివాలయం), ప్రచార కార్యదర్శిగా ఆర్ ప్రతాప్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.