ఉపాధి వేటలో.. చితికిన బతుకు
సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఉపాధి వేటలో గల్ఫ్ బాట పట్టిన వలస కూలీ ప్రమాదంలో మరణించగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం దు:ఖాన్ని దిగమింగింది. అక్కడి ప్రభుత్వ ఆంక్షలతో దినమొక గండంగా గడుపుతూ కడసారి ఆ ఇంటిపెద్ద శవం కోసం నిరీక్షించింది.ఇంటికి దిక్కైన చెట్టంత కొడుకు తన ముందే మృతి చెందిన వార్త విని తట్టుకేలేక మృతుని తండ్రి మరణించాడు. 69 రోజుల తర్వాత మృతుని శవం స్వగ్రామానికి చేరడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.వివరాల్లోకి వెళితే.. స్థానిక ప్రగతి నగర్ కు చెందిన తెంబరవేని శ్రీనివాస్ (42) గత రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం విజిట్ వీసా మీద గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. అక్కడ స్టీల్ కంపెనీలో కూలీగా చేరాడు. గల్ఫ్ దేశానికి వెళ్లడానికి చేసిన అప్పులు కొద్ది కొద్దిగా తీర్చ సాగాడు. మే 31న అక్కడి ప్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.ఈ విషయాన్ని అతని మిత్రులు ఫోన్ ద్వారా కుటుంబీకులకు తెలిపారు.శవాన్ని స్వదేశానికి పంపేందుకు అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విదించడంతో మిత్రులు చందాలు పోగుచేసి శవాన్ని స్వదేశానికి పంపారు. కాగా శ్రీనివాస్ మరణ వార్త విన్న అతని తండ్రి రాములు మనోవేదనకు గురై జూలై 5న మరణించాడు. ఒకవైపు కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తమ కొడుకు చనిపోయినా శవాన్ని కడసారైనా చూస్తామో లేదో నన్న బెంగ ఓ వైపు ఉంటే ఇంటి పెద్ద దిక్కు హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం మరింత దు:ఖంలో మునిగిపోయింది.గురువారం శ్రీనివాస్ శవపేటిక సిరిసిల్లకు చేరుకోవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. మనసున్న ప్రతి మనిషిని కదిలించాయి. మృతునికి భార్య సునీత, కూతురు భావన, కొడుకు వికాస్ లు ఉన్నారు.