ఉస్మానియా జాతి వారసత్వ సంపద
సంస్కృతి, చారిత్రక చిరునామాలు కోల్పోతే ఆ జాతికి చరిత్ర ఉండదు
సేవ్ ఉస్మానియా పేరిట మహా ఉద్యమం
హైదరాబాద్ ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) :ఏ జాతి చరిత్ర నిర్ధరించబడేది ఆజాతి చారిత్రక చిహ్నలు, వారసత్వ సంపదపైనే. దనం కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు సంస్కృతి చారిత్రక కట్టడాలను కోల్పోతే ఆ జాతికి చరిత్ర ఉండదు. ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రిని కోల్పోతే మనం చరిత్ర హీనులవుతాము.
ఉస్మానియా చారిత్రక కట్టడాన్ని కాపాడేందుకు మేధావి లోకం గళమెత్తింది. శతాబ్ద కాలంగా హైదరాబాద్ కేంద్రంగా పేదల సంజీవనిలా ప్రాణాలు నిలబెడుతున్న ఉస్మానియా ధర్మాసుపత్రిని కాపాడాలని మేధావులు, ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు ముందుకొచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా మారుతున్నాయని మేధావులు రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సేవ్ ఉస్మానియా నినాదంతో మేధావులు, రాజకీయ,ప్రజా సంఘాలను ఒకే వేదికపై నిలిపింది.
1866లో ప్రారంభం..
సరిగ్గా వారం క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉస్మానియాలో పర్యటించారు. ఆసుపత్రి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని వెంటనే కూల్చి దాని స్థానంలో టవర్ల నిర్మాణం చేస్తామని ఘనంగా ప్రకటించారు. వెంటనే వారం రోజుల్లోగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని రోగుల్ని తరలించి కూల్చివేత కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. మూసీనది తీరంలో 1866లో రెండుఅంతస్తుల భవనంలో ఈ దవాఖాన ప్రారంభమైంది. అనంతరం 1925 లో ఏడవ నిజాం విూర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలతో పాటు ఈ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి చేస్తూ నూతన భవనాన్ని నిర్మించారు. పేదలకు ఉచిత వైద్యం అందించే దవాఖానాగా స్వతంత్రానికి ముందు, అనంతరం కూడా ఈ వైద్యశాలకు పేరుంది. ఇదిలా ఉంటే తెలంగాణ తొలి సీఎంగా అంతకన్నా మించి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియా ధర్మాసుపత్రి చరిత్ర మొత్తం కేసీఆర్‌కు తెలియని విషయం కాదు.కానీ కేసీఆర్ గతంలో చెస్ట్ ఆసుపత్రి, ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో వివాదాస్పదం చేసినట్లుగానే జనరల్ ఆసుపత్రి విషయంలోనూ కొత్త వివాదాలకు తావిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇదే విషయమై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై సామాన్యులతో సహా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
గుర్తింపు తెచ్చిన నిర్మాణాలు..
హైదరాబాద్‌కి చార్మినార్ చారిత్రక గుర్తింపు తెచ్చినట్టుగానే హైకోర్టు, ఓయు ఆర్ట్స్‌కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లాంటివి కూడా గుర్తింపు తెచ్చాయి. హైదరాబాద్ సాంస్కృతిక లక్షణాలకి ఇవి ప్రతి రూపాలు. వీటిని కూల్చాలని ఎలా భావిస్తారని విద్యావంతులు, మేధావులు, రాజకీయ పక్షాలు గళమెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయాన్ని తోసిపుచ్చాయి. చారిత్రక వారసత్వ సంపదగా నిలిచిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కట్టడాన్ని రక్షించాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. చారిత్రక కట్టడాన్ని వదలి మిగతా ప్రాంతంలో కొత్త నిర్మాణాలను చేపట్టాలని సలహానిచ్చాయి.
నిర్మాణం కూల్చవద్దన్న కాంగ్రెస్..
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సైతం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. ఈ మేరకు ఉస్మానియా ఆసుపత్రి 10 ఎకరాల ఖాళీ స్థలంలో గత ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని పీసీసీ నేత భటివిక్రమార్క అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో హెరిటేజ్ నిర్మాణాన్ని కూల్చడానికి వీల్లేదని కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.