ఎండల భయంతో మొదలవుతున్న స్కూళ్లు

2న తెలంగాణ అవతరణ ఉత్సవాలు
4నుంచి బడిబాటకు సర్వం సన్నద్దం
కరీంనగర్‌,మే31(జ‌నం సాక్షి
): నేటి నుంచి బడులు పునః ప్రారంభమవుతున్న క్రమంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు బడిబాట కూడా చేపడుతున్నారు. పాఠశాలలు తెరవగానే ఆవాసాలు, గ్రామాల్లో  ఇంకా బడిబాట పట్టని పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎండల తీవ్రత దృష్ట్యా బడుల పునః ప్రారంభమే ఆందోళన కలిగిస్తోంది. మరో వారం రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. 45 రోజులుగా సెలవులు ఉండటం వల్ల మంచినీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించటం లాంటి కార్యక్రమాలు వెంటనే చూడలేమని ప్రధానోపాధ్యాయలు అంటున్నారు. ఇకపోతే 2న అవతరణోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పాఠశాలలను సన్నద్దం చేశారు. పాఠశాలలను శుభ్రం చేసి సిద్దం చేశారు. ఇప్పటికే బడిలో ఉన్నవారు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లకుండా చదువులు బాగా చెబుతామని, అన్ని వసతులు కల్పిస్తున్నామని, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు ఉచితంగా అందిస్తున్నామని వివరిస్తూ పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తారు. బడిబాటను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. బడికి వచ్చిన వారికి
ఉచిత పుస్తకాలు అందించటం, రుచికరంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయటం లాంటి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది.   కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు పాఠశాలల ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు బడిబాటను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, అంగన్‌వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకున్న వారిని పైతరగతులలో చేర్పించటం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.  ఇక పాఠశాల పరిధిలో ఉన్న పిల్లలు బడిబాట పట్టేలా ప్రోత్సహించటమే చేయాల్సింది. అసలు పిల్లలు లేని పాఠశాలల పరిధిలో ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్ధులు కచ్చితంగా బడిలో చేరేలా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలను పాఠశాలకు రప్పించాలి. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల ఆర్థిక దోపిడీ, ఇరుకు గదులు, విద్యార్థులపై ఒత్తిడి లాంటి కార్యక్రమాలను కూడా తల్లిదండ్రులకు వివరించేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రైవేటు పాఠశాలల పునఃప్రారంభం 11న : ట్రస్మా
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రుల కోరిక మేరకు కరీంనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలను వచ్చే నెల 11 నుంచి పునఃప్రారంభించాలని ‘ప్రభుత్వామోదిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా)’ కరీంనగర్‌ పట్టణ కార్యవర్గ సమావేశంలో తీర్మానింమని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శేఖర్‌రావు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయులు, బస్సు డ్రైవర్లకు వారి వారి పాఠశాలల్లో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు చెప్పారు. జూన్‌ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించాలని పేర్కొన్నారు.
——————–