ఎన్నికల వేళ ఉద్యోగాల జాతర


ప్రభుత్వాలు మారిన కలకాలం ‘బంగారుతల్లి’
లాంఛనంగా ప్రారంభించిన సీఎం
హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) :
ఎన్నికల వేళ ఉద్యోగాల జాతరకు తెరతీసింది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి రాకముందే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. నోటిఫికేషన్ల జారీకి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌ ఆమోదముద్ర వేశారు. 24,078 ఉద్యోగాల భర్తీకి కిరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. డీఎస్సీ ద్వారా 20.508 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలు – 16,287, స్కూల్‌ అసిస్టెంట్లు -2,530, పీఈటీలు – 264, లాంగ్వేజ్‌ పండింట్లు -1,125 ఉన్నాయి. ఐసీడీఎస్‌ గ్రేడ్‌ వన్‌ సూపర్‌వైజర్స్‌ – 665, వెటర్నరీ అసిస్టెంట్లు – 400 ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా సీఎం బంగారుతల్లి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ‘బంగారుతల్లి’ పథకాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. భ్రూణ హత్యలు నిర్మూలించేందుకు, మహిళలకు హక్కులు కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. బంగారు తల్లులను చంపే హక్కు తల్లిదండ్రులకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బంగారుతల్లి’ పథకాన్ని ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో ప్రారంభించారు. లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసిన అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. ఇక రాష్ట్రంలో ఎవరూ ఆడపిల్ల పుట్టిందని బాధపడే పరిస్థితి ఉండదన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆ మార్పు మొదలు కావాలని సీఎం కిరణ్‌ అన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2005 నుంచి 2011 వరకు 70 వేల మంది బంగారు తల్లులు (భ్రూణహత్యలు) చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తల్లులను చంపడం సమాజానికి వ్యతిరేకమన్నారు . దేశంలో గత 20 ఏళ్లలో పుట్టిన తర్వాత, పుట్టక ముందు తల్లి గర్భంలో కోటి మంది ఆడపిల్లలు బలవన్మరణాలకు గురయ్యారని సీఎం ఆవేదన వ్‌క్తం చేశారు. బంగారు తల్లులను చంపే హక్కు తల్లిదండ్రులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

మిగతా రాష్టాల్రకు ఆదర్శం కావాలి..

బంగారుతల్లి పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని సీఎం కిరన్‌ తెలిపారు. రెండ్రోజుల్లోనే 20 వేల మంది రిజిస్టేష్రన్లు చేయించుకున్నారని తెలిపారు. మే 1 తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. మహిళలకు హక్కు కల్పించాలనే బంగారుతల్లి పథకం తీసుకొచ్చామన్నారు. బంగారుతల్లి పథకానికి చట్టబద్ధత కల్పించామని చెప్పారు. ఈ చట్టంలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదని, బంగారు తల్లి పథకాన్ని ఎవరూ మార్చలేరని తెలిపారు. దేశంలో అతి పెద్ద ప్రణాళిక రాష్టాన్రిదేనని, సంక్షేమ పథకాలు ఎక్కువగా మహిళలకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు రూ.16,500 కోట్ల రుణాలిచ్చామన్నారు. మహిళలకు హక్కు కల్పించాలనే లక్ష్యంతోనే బంగారుతల్లి పథకం తీసుకొచ్చామని, ఈ పథకం అన్ని రాష్టాల్రకు ఆదర్శం కావాలని కిరణ్‌ అభిలాషించారు. ఆడపిల్ల పుట్టగానే రూ.2,500, పాపకు ఐదేళ్లు వచ్చే వరకు ఏడాదికి రూ.1500 చొప్పున చెల్లిస్తామన్నారు. బడిలో చేరినప్పుడు రూ.వెయ్యి, ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఏటా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తామన్నారు. ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకూ ఏటా రూ.3-4 వేలు ఇవ్వనున్టన్లు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు వీటితో సంబంధం లేదన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయికి రూ.లక్ష, ఇంటర్‌తోనే చదువు అపేస్తే రూ.50 వేలు ఇస్తామన్నారు. గర్భిణులు ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మగ పిల్లలతో పోల్చితే ఆడపిల్లల శాతం తగ్గుతున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి
కిరణ్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎవరూ ఆడపిల్ల పుట్టిందని బాధ పడే పరిస్థితి ఉండదన్నారు.