ఎన్నికల సంఘం కఠినంగా ఉండాలి
తంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఎన్నికల సంఘం ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. విపరీతమైన అధికారాలు కలిగి ఉన్నా సమర్థత ప్రదర్శించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమైనవి. ఓటర్ల జాబితాలు ఎంత స్వచ్ఛంగా, దోషరహితంగా ఉంటే ఎన్నికలు అంత సవ్యంగా జరుగుతాయి. కానీ ఇప్పుడేదే వివాదంగా మారింది. ఓటర్ల నమోదు, తొలగింపు ఓ ప్రమసనంగా మారంది. పక్కా కార్యాచరణ జరగడం లేదు. శేషన్ లాగా బూజు దులిపి హంటర్ చేతబట్టిన వారు తరవాలి కాలంలొ రాలేదు. ఓటర్ల నమోదు, తొలగింపు, నిర్వహణ అంతా వివాదాల్లో నడుస్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ప క్షపాతంగా నిర్వహించడం ఈ సంస్థ నైతిక బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు చోట్లా ఓటర్ల జాబితాలలో అనేక అవకతవకులు బయటపడ్డాయి. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపైనా, రాష్ట్రప్రభుత్వ సిబ్బందిపైనా ఆధారపడి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర అధికారులు సహజంగానే అధికారపార్టీకి విధేయంగా ఉంటారు. అటువంట ప్పుడు అధికారపార్టీ బుద్ధిపూర్వకంగా రకరకాల ఎన్నికల అక్రమాలకు ఒడిగట్టితే వాటిని ఎన్నికల కమిషన్ ఏవిధంగా నివారించగలదనే సందేహం వేధిస్తున్నది. ఓటర్ల తొలగింపు ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. దీనిని ఏ విధంగా చక్కదిద్దుతారో తెలియడం లేదు. ఓటరు ఐటి కార్డు పట్టుకుని వెళితే జాబితాలో పేర్లు ఉండడం లేదు. దీనికి పక్కా విధానం అమలు కావాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలోకి వికారాబాద్ కలెక్టర్ ప్రవేశించి వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తరవాత అతడిని సస్పెండ్ చేయడం వల్ల అధికారులలో కొంత భయం పెరిగింది. దొంగ ఓట్ల విషయంలో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను పంపుతుందని చీఫ్ ఎన్నికల అధికారి సునీల్ అరోరా చెప్పారు. అధికారుల పరిశీలనలో దొంగ ఓట్లు నమోదైనట్టు రుజువైతే అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన తక్షణమే చర్య తీసుకుంటే తక్కిన అధికార యంత్రాంగం జాగ్రత్తగా ఉంటుంది. నామినేషన్ వేయడానికి గడువు ముగిసే క్షణం వరకూ కొత్త ఓట్లను చేర్చుకునే పక్రియ కొనసాగుతుంది. ఇకపోతే రాజకయీ పార్టీల ప్రమేయంతో ఓట్ల తొలగింపు జరుగుతోం దన్న వాదన ఉంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దొంగ ఓట్లను తొలగించాలనే పట్టుదల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిజంగా ఉంటే అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అంకిత భావంతో పనిచేసే సిబ్బందిని తగి నంతగా సమకూర్చాలని రాష్ట్రపతిని అభ్యర్థించాలి. నామినేషన్ల గడువు ముగియడానికి ముందు కొద్దివారాలలో అంతదాకా ఉన్న ఓట్లకు పదిహేను లేదా ఇరవై శాతం కొత్త ఓట్లు నమోదు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. నామినేషన్లు ముగిసిన తర్వాత దొంగ ఓట్లను గుర్తించి, తొలగించడానికి తగిన సమయం ఉండటం లేదు. అక్రమాలు జరిగినట్టు తెలుసుకొని ఎన్నికల పక్రియ ముగిసిన తర్వాత అధికారులపైన ఎటువంటి చర్య తీసుకున్నా లాభం ఉండదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు మంచి పేరు ఉన్నప్పటికీ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం యథావిధిగా జరుగుతోంది. ఓట్ల నమోదులో కొన్ని రాజకీయ పక్షాలు అదే పని విూద ఉంటాయి. అధికార పార్టీ నేతలు బోగస్ ఓట్లను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తు న్నారన్న ఆరోపణలు అన్నచోట్లా వున్నాయి. సర్వేల పేరిట జరుగుతున్న తతంగం కూడా అధికార పార్టీ నేతల
పర్యవేక్షణలోనే సాగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎటువంటి విచారణ లేకుండానే బోగస్ ఓటర్లను నమోదు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దొంగ ఓట్లు ఫలానా ప్రాంతంలో ఉన్నాయనీ, దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనీ ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశిస్తే చక్కదిద్దుతారన్న భరోసా లేదు. సర్వసాధారణంగా ఎవ్వరూ ఏవిూ పరిశీలించకుండా, తనిఖీ చేయకుండా అంతా సవ్యంగా ఉన్నట్టు నివేదికలు పంపుతారు. తెలంగాణలో ఇదే జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేసినా, న్యాయమూర్తులు ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించినా బోగస్ ఓట్లను అరికట్టలేక పోయారు. అంతా సవ్యంగానే ఉన్నదంటూ న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. చివరికి ఎన్నికల పక్రియ పూర్తయిన అనంతరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్‌కుమార్ సారీతో సరిపుచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇసి సక్రమంగా ముందుకు వెళ్లగలదు. గతానుభవాను దృష్టిలో పెట్టుకుని పక్కా నమోదు కార్యక్రమం ఉండాలి. అవసరమైతే సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవాలి. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎంతవారైనా వారిపైన చర్యలు తప్పవన్న హెచ్చరికలు కఠినంగా అమలు కావాలి. అప్పుడే భయం ఏర్పడుతుంది. అందుకు ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా అన్నది చూడాలి.