ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ

` బారికేడ్లు ఎక్కిన ఎంపీలు
` అడ్డుకుని బస్సుల్లో తరలించిన పోలీసులు
` స్పష్టమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌
` బిహార్‌ వ్యవహారం సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఈసీకి కాంగ్రెస్‌ లేఖ
` అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం..
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయని, స్పష్టమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఓ నియోజక వర్గంలో సర్వే నిర్వహించగా.. దాదాపు లక్ష నకిలీ ఓట్లు తేలాయన్నారు. ఈ నిజం దేశం ముందున్నా .. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలో విపక్ష ఎంపీలు చేపట్టిన ‘పార్లమెంట్‌ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తతంగా మారింది.ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఈ ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయల్దేరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ సహా దాదాపు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. అయితే.. ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంసద్‌ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ రహదారిని బ్లాక్‌ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఖిలేశ్‌ యాదవ్‌ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు యత్నించారు. వాటిపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, బిహార్‌ సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఈసీకి లేఖ రాశారు. ఇందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.. విపక్షాలతో భేటీకి అంగీకరించింది. అయితే, 30 మంది విపక్ష ఎంపీలు మాత్రమే సమావేశానికి రావాలని చెబుతూ సోమవారం మధ్యాహ్నానికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చింది.

 

నిరసనల మధ్య బిల్లుల ఆమోదం
` కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం
` ఐటి, స్పోర్ట్స్‌ బిల్లులకూ సభ మద్దతు
` ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు
న్యూఢల్లీి(జనంసాక్షి):కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బైజయంత్‌ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నవీకరించిన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టారు.బిల్లు ప్రవేశపెట్టిన 3 నిమిషాలకే ఎలాంటి చర్చా జరగకుండానే మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. బిహార్‌ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండడంతో దీనిపై చర్చకు తావులేకుండా పోయింది. బిల్లు పాసైన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడిరది.ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్రం లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టింది. విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని సెలక్ట్‌ కమిటీకి పంపించింది. కమిటీ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. ఆదాయపు పన్ను (నం.2) బిల్లు-2025ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత శుక్రవారం పాత బిల్లును ఉపసంహరించుకున్నారు. సెలక్ట్‌ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమోదించినట్లు మంత్రి వెల్లడిరచారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి 66 బడ్జెట్‌లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు కొత్త బిల్లును రూపొందించారు. లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లు తదుపరి రాజ్యసభకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో కొత్త చట్టంగా మారనుంది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.పాత ఆదాయపు పన్ను చట్టంలో ‘క్రితం సంవత్సరం’ ‘అసెస్‌మెంట్‌ ఇయర్‌’ అనే పదాలు వాడుకలో ఉన్నాయి. కొత్త బిల్లులో వీటి స్థానే ‘పన్ను సంవత్సరం’ వినియోగంలోకి రానుంది.2025 ఆదాయపు పన్ను బిల్లు కొత్త పన్నులేమీ విధించదు. ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబులు, రేట్లను మార్చదు. అలాగే ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు తేదీలు, ఆదాయపు పన్ను శ్లాబులు, మూలధన లాభాల్లో ఎటువంటి మార్పులూ ఉండవు.వేతనాల నుంచి డిడక్షన్ల విషయానికొస్తే అంటే స్టాండర్డ్‌ డిడక్షన్‌, గ్రాడ్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలు వేర్వేరు సెక్షన్లు, నిబంధనల కింద ఉన్నాయి. వీటిని ఒకే దగ్గరకు తీసుకొచ్చి పట్టిక రూపంలో కనిపిస్తాయి.
ఐటి, స్పోర్ట్స్‌ బిల్లులకు సభ మద్దతు
విపక్షాల నుంచి సర్‌పై నిరసనలు గందరగోళం నడుమనే లోక్‌సభలో సోమవారం మొత్తం నాలుగు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. రెండు ఆదాయపు పన్ను పన్నుల వసూళ్లకు సంబంధించినవి, మరో రెండు క్రీడావిధానాల సంస్కరణల పరిధిలోకి వచ్చేవి. పన్నుల విధింపు సంబంధిత ఇన్‌కం టాక్స్‌ (నెంబరు 2) ,పన్నుల విధింపునకు సంబంధించిన టాక్సేషన్‌ లాస్‌ (సవరణ) బిల్లు ఇప్పుడు సభామోదం దక్కించుకున్నాయి. సోమవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. దేశంలో అమలులో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు 1961 నాటి ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఈ చట్టాన్ని సవరించి , సరైన విధంగా పటిష్టం చేసేందుకు ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లు తీసుకువచ్చారు.ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే పాత చట్టం స్థానంలో కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం అంశాలను పరిశీలించేందుకు బిజెపి సీనియర్‌ ఎంపి బైజ్యనాథ్‌ పాండా సారధ్యంలో ఏర్పాటు- అయిన సెలెక్ట్‌ కమిటీ- సిఫార్సులను ఈ బిల్లులో పొందుపర్చారు. ఇక పన్నుల విధింపు సంబంధిత బిల్లు పన్నుల వ్యవస్థీకృత పద్ధతులలో మార్పునకు ఉద్ధేశించింది. ఈ క్రమంలో ఈ ఏడాది తీసుకువచ్చిన ఫైనాన్స్‌ యాక్ట్‌ను కూడా సవరించడం జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఐటి బిల్లు 2025లో పలు మార్పులు చేర్పులను సెలెక్ట్‌ కమిటీ- సిఫార్సు చేసింది. ఇవి కూడా ఇప్పటి తాజా బిల్లులో చేరాయి. బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్‌పై ప్రతిపక్షాలు సభలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో సభా కార్యక్రమాల దశలో గందరగోళం ఏర్పడిన దశలోనే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లు- సభాధ్యక్ష స్థానం నుంచి ప్రకటన వెలువడిరది. ప్రతిపక్షాల ప్రాతినిధ్యం అంతకు ముందటి చర్చ పక్రియ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది.క్రీడా విధానానికి సంబంధించిన అత్యంత కీలకమైన నేషనల్‌ స్పోర్ట్‌ గవర్నెస్‌ బిల్లును , నేషనల్‌ యాంటీ- డోపింగ్‌ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. సర్‌పై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమనే ఈ బిల్లులు సభా సమ్మతి దక్కించుకుంది. స్వాతంత్యంª`ర వచ్చిన తరువాత దేశంలో క్రీడా విధాన సంస్కరణల దిశలో తీసుకువచ్చిన బిల్లు ఇదే అని క్రీడల మంత్రి మనుసుఖ్‌ మాండవీయ తెలిపారు. క్రీడా రంగంలో ఏకైక సంస్కరణల అడుగు అని స్పందించారు. ఈ రెండు క్రీడా బిల్లులతో జవాబుదారి , సరైన న్యాయం, సుపరిపాలనకు వీలేర్పడుతుంది. క్రీడా సమాఖ్యలు సముచితంగా వ్యవహరించేందుకు వీలేర్పడుతుందని మంత్రి తెలిపారు. బిల్లులు సభలో ప్రవేశపెట్టిన సమయంలో సభలో ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేరు. దేశ క్రీడా యవనికలో గణనీయ పరిణామానికి దారితీసే ఈ బిల్లుల దశలో ప్రతిపక్షాలు సభలో లేకపోవడం దురదృష్టకరం అని మంత్రి వ్యాఖ్యానించారు.