అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్‌

` ప్రాజెక్టులు పేల్చివేస్తాం
` అణుబాంబును ప్రయోగిస్తాం
` మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం
` పాక్‌ ఆర్మీ చీఫ్‌ పిచ్చి ప్రేలాపనలు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌.. అక్కడి నుంచే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని.. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ మునీర్‌ పిచ్చి ప్రేలాపనలు చేశారు.ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్‌.. అక్కడి పాక్‌ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘సింధూ నదిపై భారత్‌ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తాం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూదిల్లీ నుంచి మా అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశం లోపలికి ఫోన్లు, డిజిటల్‌ పరికరాలను అనుమతించలేదట. ఈ సందర్భంగా భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలను మునీర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.అసీం మునీర్‌ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన విందులో పాక్‌ ఆర్మీ చీఫ్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్‌ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదించారు. భారత్‌పై ట్రంప్‌ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్‌ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పాక్‌ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.