కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష
` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు
న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. కేవలం పురుషులకే వీటిని రిజర్వ్‌ చేయడాన్ని సుప్రీం తప్పు పట్టింది. ప్రస్తుత విధానాన్ని అమలు చేయకూడదని తేల్చి చెప్పింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్‌ చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ లీగల్‌ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్‌ కౌర్‌, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినప్పటికీ వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్‌ చేసింది.తాజాగా ఈ అంశంపై తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం.. ఆర్మీ ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ విభాగంలో పురుషులకు 6.. మహిళలకు 3 పోస్టులు కేటాయించాలని నిష్పత్తి పెట్టడం ఏకపక్ష నిర్ణయం. లింగ తటస్థతకు నిజమైన అర్థం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమే. అంతేగానీ, ఇలా మహిళలకు సీట్లను పరిమితం చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. మహిళలపై పరిమితి పెట్టి.. ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్‌ చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు వెల్లడిరచింది. ఇలాంటి విధానాలను అనుసరిస్తే ఏ దేశం భద్రంగా ఉండబోదని ధర్మాసనం అభిప్రాయపడిరది. ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపిక పక్రియలో భాగంగా స్త్రీ, పురుష అభ్యర్థుల మెరిట్‌ జాబితాను బహిర్గతం చేయాలని సూచించింది.