ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు ఒకే ఫిజికల్‌ టెస్టు

జనంసాక్షి జులై 12
 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు అభ్యర్థులు వేర్వేరుగా చేసుకొన్న దరఖాస్తులను రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి ఒకే గాటన కట్టి ఫిజికల్‌ టెస్టులు నిర్వహించనుంది. ఇందుకోసం.. వేర్వేరు మొబైల్‌ నంబర్లతో చేసుకొన్న అప్లికేషన్లను మెర్జ్‌ చేసింది. అభ్యర్థి మొదట ఏ మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకున్నారో అదే యూజర్‌ ఐడీగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. రెండు పోస్టులకు వేర్వేరుగా పరుగు పందెం, ఇతర ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారన్న ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు వేర్వేరు మొబైల్‌ నంబర్లతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, అన్ని రకాల పోస్టులకు ఒకేసారి ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తామని నియామక మండలి నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా తెలిపింది. దరఖాస్తుల మెర్జింగ్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించింది. కాగా, ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి.