ఏమిటీ పిచ్‌ల గోల?

కోల్‌కతా పిచ్‌పై ధోని అసంతృప్తి

క్యూరేటర్‌ ముఖర్జీని తప్పించిన బీసీసీఐ

నెల రోజులు సెలవులో వెళ్లిన క్యూరేటర్‌

క్రికెట్‌ వందకోట్లకుపైగా జనాభా ఉన్న భారత దేశంలో అంత్యంత ప్రజాధరణ పొందిన క్రీడ. వ్యాపారం పేరుతో దేశంలోకి ప్రవేశించి, ఇక్కడి పాలకుల బలహీనతలను ఆధారంగా చేసుకుని సార్వభౌమత్వాన్ని బలవంతంగా లాక్కున్న ఆంగ్లేయులు వెళ్తూ, వెళ్తూ అంటగట్టిన ఆట. శాస్త్రసాంకేతిర రంగాలు దిన దినం అభివృద్ధి చెందుతున్న కాలంలో దూరదర్శన్‌లో క్రికెట్‌ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. దేశానికి నిర్దిష్ట క్రీడావిధానం అంటూ లేకపోవడంతో జాతీయ క్రీడ హాకీతో పాటు ఇక్కడే పురుడుపోసుకున్న చదరంగం వెనుకంజలో ఉన్న కాలమది. దేశీయ సంప్రదాయ క్రీడలు పాలకుల నిర్లక్ష్యంతో ఉనికిని చాటుకునేందుకు నానా కష్టాలు పడ్డ సందర్భంలో అప్పుడప్పుడు అదృష్టవశాత్తు కంటి తుడుపు విజయాలు సాధించిన భారత క్రికెట్‌ జట్టు 1983లో వరల్డ్‌ కప్‌ గెలవడం చారిత్రాత్మకం.   ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన హాకీ జట్టు తర్వాత బోర్డులో కమ్ములాటలు, కుతంత్రాలతో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంది. అలాంటి పరిస్థితుల్లో కపిల్‌దేవ్‌ కెప్టెన్సీలోని అనామక జట్టుకు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిల్చిన వెస్ట్‌ ఇండీస్‌ను మట్టి కరిపించి ప్రపంచకప్‌ సొంతం చేసుకుంది. ఆ విజయమే భారతీయులందరికీ క్రికెట్‌ను దరి చేర్చింది. నిజానికి కపిల్‌దేవ్‌కు పూర్వం భారతజట్టులో మెరుగైన ఫాస్ట్‌ బౌలర్‌ లేడు. బెంగళూర్‌లో ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ ఏర్పడేనాటికి వేళ్లమీద లెక్కించేంత మంది మాత్రమే భారత్‌లో ఫాస్ట్‌ బౌలర్లుండేవారు. అంటే మన తరఫున ఆడుతున్న క్రికెట్‌ జట్టులో బౌలర్లంటే స్పిన్నర్లు మాత్రమే. లీగ్‌ స్థాయి మొదలుకొని జాతీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో భారత బ్యాట్స్‌మన్‌ స్పిన్‌ను దీటుగా ఎదుర్కొంటాడనే నమ్మకం మొన్నటి వరకు అందరికీ ఉండేది. ముంబయి వాంఖడే స్టేడియంలో మన జాతీయ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ను ఇంగ్లిష్‌ స్పిన్నర్‌ మాంటి పనేసర్‌ టప టప పడగొడుతుంటే ఒక్క భారత అభిమానులే కాదు యావత్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానులు నివ్వెరబోయా రు. ప్రపంచంలోనే మొదటిసారిగా శత శతకాలు బాదిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, క్వా డబుల్‌ సెంచరీ బాది రికార్డు సృష్టించిన వీరేంద్రసెహ్వాగ్‌, హెలీ క్యాప్టర్‌ షాట్ల స్పెషలిస్ట్‌ కెప్టెన్‌   ధోని, చిచ్చర పిడుగు విరాట్‌ కోహ్లీ గింగిరాలు తిరిగే బంతులు ఎలా ఎదుర్కోవాలో తెలియక చేతులెత్తేసి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముంబయి టెస్ట్‌లో భారత రెండు ఇన్నింగ్స్‌లను చూసిన వారికి గల్లీ క్రికెట్‌ చూస్తు న్న ఫీలింగ్‌ కలుగక మానదు. మ్యాచ్‌ ముగియగానే భారత జట్టు కెప్టెన్‌ ధోని సహజ శైలిలో నెపం పిచ్‌పై నెట్టాడు. కోల్‌కతాలో జరిగే మూడో టెస్ట్‌కు కూడా వాంఖడే స్టేడియంలోని పిచ్‌ లాంటిదే తయారు చేయా లని ఉచిత సలహా ఇచ్చాడు. మొదటి రోజు నుంచే బంతి మెలికలు తిరగాలని కోరాడు. ఆడలేక పిచ్‌పైకి నెపం నెట్టి బీసీసీఐని ప్రభావితం చేయాలని చూశాడు. ధోనికి బీసీసీఐ పెద్దలు వంతపాడారు. ఆయన కోరుకున్నట్టు పిచ్‌ తయారు చేయలేదని క్యూరేటర్‌ ముఖర్జీపై వేటు వేశారు. దీనిని నిరసిస్తూ ఆయన నెల రోజుల పాటు సెలవులో వెళ్లారు. పిచ్‌ వివాదం పిచ్చిలా మారింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో ప్రపంచ దేశాలకు సవాల్‌ విసిరి వన్డేల్లో 300 పైచిలుకు లక్ష్యాలను సునాయసంగా ఛేదించిన భారత్‌ జట్టు సొంత గడ్డపై వైఫల్యాన్ని పిచ్‌లపైకి నెట్టడం సగటు క్రికెట్‌ అభిమానికి ఆందోళన కలిగించే అంశం. ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ ఓటమికి స్వదేశంలో బదులు తీర్చుకుంటామని బీరాలు పోయిన జార్ఖండ్‌ డైనమేట్‌ ఫామ్‌ను కోల్పోయి తంటాలు పడుతున్నాడు. స్వతహాగా ఆత్మవిశ్వాసం కోల్పోయి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇంగ్లిష్‌ బౌలర్లు బంతిని బొంగరంలా గింగిరాలు తిప్పిన పిచ్‌పై భారత దిగ్గజ స్పిన్నర్లు వెలవెలబోయారు. ఒకప్పుడు మెరుపులు మెరిపించిన హర్బజన్‌సింగ్‌ పేలవమైన బౌలింగ్‌తో జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రజ్ఞాన్‌ ఓజా పర్వాలేదనిపించినా అశ్విన్‌ ఫామ్‌ జట్టును కలవరపరుస్తోంది. ఉపఖండంలోని జీవం లేని పిచ్‌లపై సహజంగా మూడో రోజు నుంచి బంతి స్పిన్‌ తిరగడం పరిపాటి. ఇన్నింగ్స్‌ విజయాలు సాధించాలనే కాంక్షతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పిచ్‌లు తయారు చేయించడం దారుణం. ఇది మనమే ప్రారంభించకపోయినా భారత్‌ అంటే ప్రపంచ దేశాలకు ఉన్న గౌరవం ఇలాంటి చర్యలతో పలుచన పడటం ఖాయం. ఫామ్‌ను కోల్పోయిన వారిని రొటేషన్‌ ప్రాతిపదికన మార్చుకుంటూ పోతే చతేశ్వర్‌ పుజారా లాంటి ఆణిముత్యాలు దొరక్కపోరు. లేకుంటే ఇలాంటి పరాజయాలు మరిన్ని మూటగట్టుకోవడం ఖాయం.

– జనంసాక్షి, స్పోర్ట్స్‌ డెస్క్‌