ఒకేసారి రుణమాఫీ చేయండి
– విపక్షాల డిమాండ్
– 32 మంది సభ్యుల సస్సెన్షన్
– చీకటి రోజుగా అభివర్ణించిన ప్రతిపక్షాలు
– రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
హైదరాబాద్ అక్టోబర్ 05 (జనంసాక్షి):
మూడురోజుల విరామం అనంతరం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆదిలోనే గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే రుణమాఫీపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత వారించినా వారు వినకుండా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… సభకు అడ్డుతగులుతున్న విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాల్సిందిగా వారి పేర్లు సూచిస్తూ ప్రభుత్వం తరఫÛన స్పీకర్‌కు విన్నవించారు. దీంతో 32 సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సభ్యులపై సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ పేర్కొన్నారు.
సస్పెన్షన్‌కు గురైన సభ్యలు వీరే…
కాంగ్రెస్: పువ్వాడ అజయ్‌కుమార్, డి.కె.అరుణ, మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్, భాస్కర్‌రావు, పద్మావతిరెడ్డి
తెదేపా: రేవంత్‌రెడ్డి, ఎ.గాంధీ, ప్రకాశ్ణ్‌ొడ్, మాగంటి గోపీనాథ్, రాజేందర్‌రెడ్డి, జి.సాయన్న, వివేకానంద
భాజపా: కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి
వైకాపా: పాయం వెంకటేశ్వర్లు
వామపక్షాలు: రవీందర్‌కుమార్, సున్నం రాజయ్య
స్వతంత్ర సభ్యుడు మాధవరెడ్డి
రుణమాఫీపై చర్చకు విపక్షాల పట్టు
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. దీనిపై స్పీకర్ మధుసూదనాచారి స్పందిస్తూ… రైతుల సమస్యలపై 13 గంటల పాటు చర్చ జరిగిందని… ఈ అంశంపై ప్రభుత్వం తాను తీసుకునే చర్యలపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిందని తెలిపారు. సభలో చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నందున సభ సజావుగా సాగేలా సహకరించాలని విపక్ష సభ్యులను కోరారు.
రైతు ఆత్మహత్యల నివారణకు స్పష్టమైన ప్రకటన చేశాం: కేసీఆర్
రైతుల ఆత్మహత్యల నివారణకు తమ ప్రభుత్వం సభలో స్పష్టమైన ప్రకటన చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బీఏసీ సమావేశంలో నిర్దేశించిన ప్రకారం రైతు ఆత్మహత్యలపై సభలో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ చేపట్టినట్లు తెలిపారు. రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తామో స్పష్టంగా ప్రకటన చేసినప్పటికీ విపక్షాలు సభ జరగనివ్వబోమని అనడం సరికాదని సూచించారు.
సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికం: జానారెడ్డి
అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగని దురదృష్టకర సంఘటన ఈరోజు శాసనసభలో చోటుచేసుకుందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. శాసనసభలో సస్పెన్షన్‌కు గురైన సభ్యులతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించాలని కోరిన సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులను వేధించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సభలో సుదీర్ఘంగా చర్చ చేపట్టినప్పటికీ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే ప్రకటన ఏదీ చేయలేదని… దానిని ప్రస్తావించినందుకే సభ్యులను అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలన్న లక్ష్యంతోనే తాము ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం తప్పించుకునే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ చరిత్రలో చీకటి దినం: లక్ష్మణ్
అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి దినమని తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత డా.లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం చర్యను తీవ్రంగా ఖండించారు. రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబడిన సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగాన్ని అవమానించిందని అన్నారు. శాసనసభ సమావేశాల ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎదురుచూసిన రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు
ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: రైతుల సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేయడం తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిదర్శనమని తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… సభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమైన చర్యల అని అన్నారు. రైతులకు రుణవిముక్తి కలిగించాలని కోరుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతు సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వంపై పోరాడతామన్నారు. అవసరమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.
విపక్ష సభ్యుల సస్పెన్షన్ దారుణం: ఎర్రబెల్లి
తెలంగాణ శాసనసభలో రైతు సమస్యలపై ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమైన సభ్యులందరినీ సస్పెండ్ చేయడంతో అసెంబ్లీలో రైతుల ఆవేదను వినిపించేవారే కరువయ్యారని అన్నారు.
నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా
హైదరాబాద్: శాసనసభలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రమణ ఆరోపించారు.
రుణమాఫీపై మండలిలో ఆందోళన…ఆరుగురు సభ్యుల సస్పెన్షన్
రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని తెలంగాణ శాసనమండలిలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, భాజపా సభ్యులు ప్లకార్డులు చేతబూని పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆందోళన చేసిన వారిలో ఐదుగురు కాంగ్రెస్, ఒక భాజపా సభ్యుడిని మండలి ా’య్రర్మన్ ఒక రోజు సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి, ఎంఎస్ ప్రభాకర్, ఫరూక్ హుస్సేన్, లలిత, భాజపా నుంచి రామచంద్రరావు సస్పెన్షన్‌కు గురయ్యారు.