ఒళ్లు మరిచి మాట్లాడుతారా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలోని కొందరు నేతలు మాట్లాడే తీరును చూస్తే స్థాయిపైనే సందేహాలు కలుగుతాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఏఐసీసీలోని ముఖ్య నేతలు పరస్పర గందరగోళ ప్రకటనలు జారీ చేయడం ఇటీవల కాలంలో పదే పదే చోటు చేసుకుంటోంది. కొందరు తెలంగాణవాదాన్నే పూర్తిగా అవమానపరిచేలా మాట్లాడుతుందగా, మరికొందరు ముందు ఏదో ఒకటి మాట్లాడి తర్వాత వివరణలిచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న పీసీ చాకో, రేణుకాచౌదరి తెలంగాణపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నావారే. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అదే కోవకు చెందుతారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ తెలంగాణపై మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరి అందరికీ తెలిసిందే. కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమ రూపుశిల్పుల్లో ఒకరైన రేణుకాచౌదరిని ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ప్రకటిస్తే ఆమె తెలంగాణ ప్రజలను ఎలా గౌరవిస్తుంది. తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలను ఆమె ఎంత దుర్మార్గంగా చిత్రీకరించింది. తెలంగాణవాదాన్ని ఎంత చులకన చేసి, పలుచన చేసి ఆమె మాట్లాడుతోంది. ఇవేవి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పట్టవు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతనిధులు ప్రకటించేది ముమ్మాటికీ పార్టీ అధిష్టానం వైఖరే. దీన్ని కాదనడం లేదా ముందు మాట్లాడేసి అబ్బబ్బే నేనలా అనలేదు అని వ్యాఖ్యానించడం ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకే చెల్లింది. రేణుకాచౌదరి ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎవరూ చనిపోలేదని, వారంతా రోగాలు, రోష్టులతో చచ్చినవారేనని పేర్కొంది. చనిపోయిన వారిని గౌరవించాలనే ఇంగితాన్ని విస్మరించి ఆమె అమరవీరులను అవమానపరిచింది. మరో అడుగు ముందుకేసీ చనిపోయిన వారిలో కొందరిని నక్సలైట్లు హత్య చేశారని చెప్పింది. ఒకప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఎవరినైనా హత్య చేసిందంటే అందుకు రకరకాల కారణాలున్నాయి. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన ఎజెండాలో పెట్టుకుంది. మావోయిస్టులు ఎవరినైనా హత్య చేస్తే పోలీసులు సృష్టించే హడావుడి అంతాఇంతా కాదు. రాజ్యానికి ఊడిగం చేసే ఖాకీలు మావోయిస్టులు చేసేవి హత్యలుగా పేర్కొంటూ పెద్ద హంగామా చేసేవారు. ఇవేవి తెలంగాణ అమరవీరుల మృతి సందర్భంలో కానరాలేదు. మరి రేణుకా చౌదరి స్పృహలో ఉండి మాట్లాడారా? తెలంగాణ అంటే తనలో గూడుకట్టుకున్న ఏహ్య భావాన్ని బయటపెట్టారా? అంటే ఠక్కున సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉండి తమ సొంత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయంగా చెప్పే ప్రయత్నం చేసిన రేణుకాచౌదరిలాంటి వారు ఎందరో ఉన్నారు. వారిని కట్టడి చేయడానికి పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రయత్నం చేయలేదు. తెలంగాణవాదం ఎన్నికల అంశంగా ఉన్నంతకాలం హామీలిస్తూ కాలం గడపొచ్చు అనే భావనలో సోనియాగాంధీ అండ్ కో ఉన్నట్లు స్పష్టమవుతుంది. భావి ప్రధానిగా దశాబ్దికాలంలో వే నోళ్లలో నానుతున్న రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు బద్ధ వ్యతిరేకి అనే వార్తలు వెలువడ్డాయి. వాటిని కనీసం అధిష్టానం పక్షాన ఖండించే ప్రయత్నం కూడా జరగలేదంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో రెండు రోజుల క్రితం పీసీ చాకో అడ్డగోలుగా మాట్లాడటం మరుసటి రోజు తాను అలా అనలేదు మీడియా వక్రీకరించింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం జరిగిపోయాయి. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే అధిష్టానం పెద్దల తీరుపై పది జిల్లాల ప్రజలు కన్నెర్ర జేస్తేగాని వారి వైఖరిలో మార్పురావడం లేదు. ముందు ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత వివరణ ఇచ్చుకునేలా తేగలుగుతున్న తెలంగాణ ఉద్యమ తీవ్రత కాంగ్రెస్ అధిష్టానానికి తెలియంది కాదు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను నయాన్నో, భయాన్నో దారికితెచ్చుకుంటే వింటారనే నమ్మకం అధిష్టానానిది. అది నిజమేనని తేలుతోంది. ఒకప్పుడు ఎనిమిది, తొమ్మిది మంది వరకూ ఉన్న టీ కాంగ్రెస్ ఎంపీల గుంపు ఇప్పుడు మూడుకు పడిపోయింది. ఆ ముగ్గురూ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. అయినా అధిష్టానం వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. తెలంగాణ ఎన్నికల అంశం మాత్రమేనని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తోంది. అసలు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ గురించి మాట్లాడే సమయంలో ఒళ్లు మరిచిపోతారా? లేక సీమాంధ్ర పెట్టుబడిదారుల సూట్‌కేసులు గొర్తొస్తాయా అనేది వారే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. కాంగ్రెస్ పార్టీ కన్నుసన్నల్లో అధినేత్రికి వీరవిధేయతలు చూపే నేతలు ఒక్క తెలంగాణ విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నారంటే ఈ అంశంపై మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వైఖరినే తప్పుబట్టక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అధికార ప్రతినిధుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.. వారికి వారే మాట్లాడుతున్నారా? పార్టీ పెద్దలే స్క్రిప్ట్ రాసి చదివిస్తున్నారా అనేవి సమాధానం లేని ప్రశ్నలు. తెలంగాణ ప్రజలను గందరగోళ పరచడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అదే రీతిలో సమాధానమిచ్చేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు.