ఓటుకు ఆధార్ అనుసంధానం
-బోగస్ ఓట్లకు కల్లెం
– ఉస్మానియాకు ఆసుపత్రికి పూర్వవైభవం
– జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూ
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,జులై20(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఓటర్లందరూ ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాగే ఆధార్ లేని ఓట్లను తిరస్కరించాలన్నారు. సోమవారం కేసీఆర్‌ను ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలిశారు. కేసీఆర్ అధికారిక నివాసంలో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆధార్‌తో అనుసంధానం కాకుంటే ఓటు హక్కు ఉండదని పేర్కొన్నారు. బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆధార్ అనుసంధానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ అనుసంధానంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్న కేసీఆర్, అనుసంధానం చేసుకోని వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు ఒకే జాబితా ఉండేలా చూడాలని, ముందుగా హైదరాబాద్‌లో ఆ తర్వాత రాష్ట్రమంతటా ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలన్నారు. 15 నుంచి 20 రోజుల్లో ఆధార్ అనుసంధానం పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఓటరు లిస్ట్ పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఉస్మానియా ఆస్పత్రికి మహర్దశ
శతాబ్ధానికిపైగా నగర ప్రజలకు సేవలు అందిస్తున్న హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధిపై హైదరాబాద్ బేగంపేటలోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా మారిందని, దాని స్థానంలో బహుళ అంతస్థుల టవర్స్ నిర్మించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఎంత ఖర్చయినా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్‌రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులన్నిట్లో ఐసీయూలు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఇంటిన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏడాది లోగా అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొదటి దశలో భాగంగా త్వరలోనే మహబూబ్ నగర్, కరీంనగర్ లో ఐసీయూ వసతిని కల్పించనున్నారు.
వైద్య, ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజధానిలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, కాకతీయ లాంటి పెద్దాసుపత్రుల్లో సదుపాయాల కల్పన, మౌలిక వసతుల కల్పన దిశగా శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో గ్రావిూణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాల మెరుగుదలకు కూడా సర్కార్ సిద్ధమైంది. పలు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకున్న సర్కార్? కొన్ని ఆసుపత్రుల స్థాయిని కూడా పెంచింది. ఇదే సమయంలో జిల్లాల్లోనే పూర్తి స్థాయి వైద్యసేవలు అందించే దిశగా కూడా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు) సౌకర్యం కల్పించాలని సంకల్పించింది.
ఇప్పటికే రాజధాని హైదరాబాద్ తో పాటు బోధనాసుపత్రులు ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, నిమ్స్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోని బోధనాసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యం రోగులకు అందుబాటులో ఉంది. అయితే మిగతా జిల్లాల్లో ఈ సౌకర్యం లేకపోవడంతో వారంతా పొరుగు జిల్లాలు, రాజధానిలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించడం లేదా కార్పోరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రోగులకు అధిక ఖర్చు కావడంతో పాటు సమయానికి సరైన వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇంటెన్సివ్ కేర్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సౌకర్యం లభిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఐసీయూ వసతి లేని జిల్లా ఆసుపత్రులు రాష్ట్రంలో ఐదున్నాయి. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లా ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం లేదు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ ఐసీయూ సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 42 ప్రాంతీయ వైద్యశాలలున్నాయి. వీటిలో కూడా ఐసియు యూనిట్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసింది. జిల్లా ఆసుపత్రుల్లో 20 పడకలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో పది పడకలతో ఐసీయూ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం యాభై కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేశారు.
ఏడాది లోగా 47 ఆసుపత్రులన్నింటిలోనూ దశల వారీగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో భాగంగా మహబూబ్ నగర్, కరీంగర్ జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యాన్ని నెలకొల్పుతారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.