ఓట్లు కాదు ఉద్యమమే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కేవలం ఓట్లతోనే సాధ్యమన్నట్టుగా ఇటీవల కాలంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ పదే పదే ప్రకటిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో అధికారం చేపట్టబోయే రాజకీయ పక్షం దిగివచ్చి తెలంగాణ ఇచ్చి తీరుతుందని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించుకోవాలంటే తమ పార్టీని గెలుపించక తప్పదని దాదాపు పది జిల్లాల ప్రజలకు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి తారస్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. మధ్యలోని కొన్ని రాజకీయ వేదికలు ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఎదిగాయి. తర్వాతకాలంలో కనుమరుగయ్యాయి. నాలుగు దశాబ్దాలు తెలంగాణ సాధించుకోకపోయినా ఉద్యమం మాత్రం ఆగలేదు. కేంద్రంలో అత్యధికకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్, మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయిచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు మోసం చేసి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరుదారిన నడిచారు. ప్రజలు ఉద్యమ పథాన సాగుతున్న కాలంలో పలు వేదికలు వారితో కలిశాయి. కొన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యమయ్యాయి. అలాంటి రాజకీయ పార్టీల్లో ఒక్కటే టీఆర్‌ఎస్. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కానీ, ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందీ కానీ టీఆర్‌ఎస్ కాదు. అలా ఎవరైనా ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యనిస్తే వారికీ చరిత్ర తెలయదనుకోవాలి. 1969లో సాగిన తెలంగాణ ఉద్యమ తీవ్రత యావత్ భారతానికంతా తెలుసు. తారస్థాయిలో సాగుతున్న ఉద్యమాన్ని సీమాంధ్ర పెత్తందారుల ఏలుబడిలోని రాష్ట్ర సర్కారు ఎంత అమానవీయంగా అణచివేసిందో అందరికీ తెలుసు.
గన్‌పార్క్ ఆనాటి తెలంగాణ అమరుల త్యాగాలను తరతరాలకు అందజేస్తుంది. ఎంతో ఉజ్వల భవిత ఉన్న 369 మంది విద్యార్థులను సర్కారు కిరాతకంగా కల్చిచంపింది. అదే సమయంలో ఉద్భవించిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) పార్టీని 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. పది పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించి లోక్‌సభకు పంపారు. చెన్నారెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ తర్వాత కొద్ది కాలానికే కాంగ్రెస్‌లో విలీనమైంది. ఓట్లు.. సీట్లు మాత్రమే తెలంగాణ తెస్తాయనుకుంటే ఆ రోజే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఉండేది. రాజకీయాల్లో ప్రలోభాలు, పదవులు సర్వ సాధారణం. పదవిలో లేనప్పుడు భీరాలు పలికే ఎందరో ఆ తర్వాత అధికారానికి దాసోహం అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి వారిని ఇప్పుడూ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లు సీట్లు ఆధారంగానే తెలంగాణ వస్తుందని ఎలా అనుకుంటాం. టీఆర్‌ఎస్‌కు 2004లో 26 మంది ఎమ్మెల్యేల బలముండేది. 2009 ఎన్నికల నాటికి ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఉద్యమపార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు అధికారపార్టీ కండువా కప్పుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు ఉద్యమ పార్టీకి వంద మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఎంతమందిని తనవెంట ఉంచుకోగలుగుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదైనా తేడాలొస్తే పార్టీ ఫిరాయించడంలో ఇప్పటి వరకూ ఉద్యమ పార్టీ వారే ముందున్నారు. ఆ సంప్రదాయం ఇకపై కొనసాగబోదని గ్యారంటీ ఏంటి? కేవలం ఎన్నికల్లో గెలిచే సీట్లే ఆధారంగా తెలంగాణ వస్తుందనుకుంటే ముమ్మాటికీ పొరపాటే. 2014 ఎన్నికల్లో మరో తొమ్మిది నెలలున్న ప్రస్తుత తరుణంలో ఉద్యమాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తే సానుకూల పరిష్కారం లభించకపోదు. కానీ ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్ ఆ ప్రయత్నం చేయడమే లేదు. సీట్లతోనే తెలంగాణ వస్తుందనేది నిజం కాదు. సాధారణ ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ ముఖచిత్రం తుది ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువైంది. వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితులు ఉండబోవని చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ సీట్ల రాజకీయం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక వచ్చింది. 2009లో మాదిరిగానే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే ఎన్నికలకు ముందు 17 సీట్లున్న ఈ ప్రాంతంతో పెట్టుకునేందుకు ఆ పార్టీ సిద్ధం కాదు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్ మాత్రమే. తెలంగాణ ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు.