కరీంగనర్‌ నుంచే రైతుబంధు

బీమా కోసం అధికారుల వివరాల సేకరణ

కరీంనగర్‌,జూన్‌15(జనంసాక్షి): ప్రతిష్టాత్మక పథకాలతో వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 26న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 17 జిల్లాల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో తొలిసారి రైతుబీమా పథకంపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. రూ.500 కోట్లు అప్పు తెచ్చి అయినా రైతులకు రూ.5లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తానని హావిూ ఇచ్చారు. అప్పటి మాటకు కట్టుబడి రైతుబంధు మొదటి విడత చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ జరుగుతుండగానే సామూహిక రైతు బీమా పథకం అమలు తేదీ ఖరారు చేశారు. హైదరాబాద్‌ హెచ్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో చర్చించిన ముఖ్యమంత్రి ఇటీవల ఎల్‌ఐసీ సంస్థ చైర్మన్‌తో ప్రభుత్వం రైతు బీమా పథకంపై ఎంవోయూ చేసుకుంది. స్వరాష్ట్రంలో రైతుకు తొలి ఫలితం రూ.లక్షలోపు రుణమాఫీ పథకం మొదలు వ్యవసాయానికి 24గంటల కరెంటు సరఫరా.. భూరికార్డుల ప్రక్షాళన.. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ.. రైతుబంధు పథకం పంట పెట్టుబడి సాయంతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం తాజాగా అన్నదాతల కుటుంబాలకు ధీమా కల్పించే మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రైతుకు పైసా ఖర్చు కాకుండా మొత్తం ప్రీమియం సొమ్మును సర్కారు భరిస్తూ ఆగస్టు 15 నుంచి సామూహిక బీమా వర్తింపజేసేందుకు నిర్ణయించింది. 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి రైతుబంధు పట్టాదార్‌ పాసుపుస్తకం పొందిన గుంట భూమి నుంచి ఆపై ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల బీమా పాలసీ బాండ్‌ అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆధార్‌కార్డులో నమోదైన పుట్టిన తేదీ ఆధారంగా రైతు బీమా పథకాన్ని పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏడాది రైతుబీమా పాలసీ ప్రీమియం సొమ్మును వ్యవసాయశాఖ ద్వారా ఎల్‌ఐసీకి అందజేస్తారు. అయితే ఎల్‌ఐసీ బీమా బాండ్‌ పొందిన రైతు ప్రమాదవశాత్తు, పాముకాటు, విద్యుత్‌ ప్రమాదంలో మృతిచెందినా, అనారోగ్యంతో సహజ మరణం చెందినా బాధిత రైతు కుటుంబానికి 10 రోజుల్లో రూ.5లక్షల బీమా సొమ్మును అందజేస్తారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందుకున్న రైతుల నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులు, రైతు మరణిస్తే ఆ సొమ్ము అందజేసేందుకు నామిని పేర్లు సేకరించే పనుల్లో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. అయితే వీరిలో 18 నుంచి 60ఏళ్ల వయస్సు లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉంటారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మండలాల వారీగా బీమా పథకానికి అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే పనిలో వ్యవసాయశాఖ తలమునకలైంది. బీమా పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సంస్థతో ఒప్పందం చేసుకుంది. రైతు ఇంటికి ఏఈవోలు వెళ్లి కొత్త పాస్‌ పుస్తకం ఆధారంగా అందులోని వివరాలు, ఆధార్‌ సంఖ్య, పుట్టిన సంవత్సరాన్ని బీమా దరఖాస్తులో నమోదు చేస్తారు. దరఖాస్తులను జూలై చివరి వరకు భారతీయ జీవిత బీమా సంస్థకు వ్యవసాయశాఖ అందజేస్తుంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతుల్లో నిబంధనల మేరకు 18 నుంచి 60ఏళ్ల లోపు ఎంత మంది అర్హులు ఉంటారనేది కొద్దిరోజుల్లో తేలుతుంది. కాగా, ప్రస్తుతం రైతుకు అందిస్తున్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకం ఇకపై ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. భూమి కేటగిరి, పట్టాదారు, సాగు విస్తీర్ణం, ఆధార్‌ నెంబర్‌, ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా, పూర్తి అడ్రస్‌, ఏ రెవెన్యూ గ్రామం, సర్వేనెంబర్‌ వంటి వివరాలన్నీ పాస్‌ పుస్తకంలో పొందుపర్చారు. రైతులు తమ భూములను అమ్ముకున్నా కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి ఈ పాస్‌ పుస్తకంలో ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశారు.