కరీంనగర్ స్మార్ట్ సిటీ పరుగులేవీ
కరీంనగర్,ఆగస్ట్6(జనం సాక్షి): కేంద్రం స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ప్రకటించాక అందుకు అనుగుణంగా ప్రణాళిక మేరకు పట్టణ ఆధునీకరణ జరగాల్సి ఉంది. అయితే అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల కాకపోవడంతో ఆధునీకరణ మేడిపండు చందంగా మారింది. ప్రధానంగా రహదారుల విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరగాలి. తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి. ఇప్పటికే పట్టణ నవీకరణకు ప్రణాళికలు రూపొందించామని మేయర్ రవీంద్ర సింగ్ వెల్లడించారు. అయితే ప్రజా అవసరాలకు తగ్గట్లు పట్టణంలో
వసతులు ఉండాలనే ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకి రావడం లేదు. నిధుల కొరత.. అరకొర కేటాయింపుల కారణంగా అడుగు ముందుకు పడటం లేదు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి ఆమోదం లభించినా ఇప్పటికీ వూసే లేదు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలుగా ఉన్నాయి. కాగా 2011 ఆగస్టులో జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, పెద్దపల్లి పంచాయతీలను నగర పంచాయితీగా మార్చారు. ఆ తర్వాత వీటన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్పు చేశారు. గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపాలిటీ సవరణ చట్టంలో ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో పాటు కొత్తగా ఆరు మున్సిపాలిటీల ఏర్పాటు చేయనున్నట్లు పొందుపర్చారు. వీటిల్లో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, చొప్పదండి, జగిత్యాలలోని ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి జిల్లాలోని మంథని, సుల్తానాబాద్ పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న ఉమ్మడి జిల్లాల్లో కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి కరీంనగర్‌లో పట్టణీకరణ కూడా వృద్ధి చెందుతోంది. అయితే అందుకు అనగుణంగా కరీంనగర్‌కు నిధుల కేటాయింపు జరగడం లేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కార్పోరేషన్ స్థాయికి చేరుకున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యింది. నగరంలోని మూడు మార్కెట్ల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. మరో రెండు కూడా అధికారులు ప్రతిపాదనలు చేస్తుండటంతో నిధుల సమస్య ముందుకు వచ్చింది. మిగతా 30 శాతం నిధులు శ్మశానవాటికలు, మార్కెట్ల అభివృద్ధి, మాంసాహార మార్కెట్లు, ఖాళీ స్థలాలకు ప్రహారీలు, కబేళాలు, కూడళ్ల అభివృద్ధికి కేటాయించ డంతో ఆ నిధులు సరిపోయే పరిస్థితి లేదు. ప్రధాన కూరగాయల మార్కెట్లు నాలుగు ఉండగా అందులో రెండు రైతు బజార్లే.. మరో రెండింటిలో ప్రధాన కూరగాయల మార్కెట్, రాంనగర్ కూరగాయల మార్కెట్ ఉన్నాయి. కొత్తగా మార్కెట్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సంఖ్య తగ్గి ప్రధాన కూరగాయల మార్కెట్‌కు భారీగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. కాలనీల మధ్య చిన్న మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నా.. ప్రభుత్వం సైతం మార్కెట్లు విస్తరించాలని, కొత్తగా ఏర్పాటు చేసేందుకు పురపాలికలు ముందుకు రావాలని పేర్కొన్నా.. ఆ దిశలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పాతబజారులో రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండగా, ముకరంపుర ప్రాంతంలో రోడ్డుపైనే విక్రయాలు జరుపుతున్నారు. అయితే ప్రధాన కూరగాయల మార్కెట్‌ను ఆధునీకరించడంతో పాటు చైతన్యపురిలోని ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్ పక్కన, ఆదర్శనగర్-ఇందిరానగర్‌లో, హౌసింగ్‌బోర్డుకాలనీలో, కట్టరాంపూర్‌లో కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయాలని స్థలాలు పరిశీలించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మినీ కూరాయల మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని పదేళ్లుగా కోరుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. కూరగాయలు కొనేందుకు ఐదారు కిలోవిూటర్ల దూరం నుంచి ప్రజలు రావాల్సి వస్తుందనే ఉద్దేశంతో. కొత్త మార్కెట్ల కోసం గత పాలకవర్గ సభ్యులు పలుమార్లు తీర్మానాలు చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అత్యంత రద్దీ గల కూరగాయల ప్రధాన మార్కెట్‌ను అన్ని హంగులతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించాలని, ఇందులోనే మల్టీ స్టోరేజ్ మార్కెట్, ఒక అంతస్తులో కూరగాయల అమ్మకాలు, మరో అంతస్తులో మాంసం, చేపల అమ్మకాలు, మరో అంతస్తులో కిరాణం దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్, సులభ్‌కాంప్లెక్స్ ఉండేలా ప్రతిపాదనలు చేసినా అడ్డంకులు అవరోధంగా మారాయి.