కరీంనగర్ జిల్లా చంజర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

రహదారులు రక్తసిక్తం
– కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
– బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి
– 30మందికిపైగా తీవ్ర గాయాలు
– క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
– ఘటన స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ఈటెల
– ప్రమాదంపై దిగా్భంతి వ్యక్తం చేసిన సీఎం
– క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
– లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చిన అధికారులు
కరీంనగర్,మే29(జనం సాక్షి): అతివేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సున ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొనడంతో ప్రమాధం జరిగింది. ఈ విషాధ ఘటన మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద చోటు చేసుకుంది. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు 40మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు చంజర్ల వద్దకు రాగానే కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా దూసుకెళ్తుంది. ఈ సమయంలో ముందున్న లారీని వెనుకాలున్న లారీ ఓవర్‌టేక్ చేసుకుంటూ రావడంతో లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బస్సును ఢీకొట్టంది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. బస్సు ఢీకొన్న లారీ వెనుకాలే వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను సైతం ఢీకొనడంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 30మందికిపైగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పలువురిని మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. బస్సు వెనుక భాగంలో లారీ బలంగా ఢీకొనడంతో సగం బస్సు తునాతునకలైంది. ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏడుగురు మృతిచెందారు. ప్రమాద ప్రాంతంలో మృతుల శరీర భాగాలు, రక్తంతో భయానక పరిస్థితి నెలకొంది. లారీ అతివేగంతో రావడం, రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మృతుల బంధువుల రోధనలతో ఘటన స్థలం మారుమోగింది. అప్పటి వరకు తమతో ఉండి అనుకోని ప్రమాదంతో మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రుల బంధువుల రోధనలతో ఆసుపత్రి ప్రాంగణం మారుమోగిపోయింది. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి వివరాలను పోలీసులు వెల్లడించారు. పిల్లి లక్ష్మీ (60)- మానకొండూర్ మండలం ముంజంపల్లి
, గుండా హరిప్రసాద్ (35) కాంట్రాక్టు లెక్చరర్- జమ్మికుంట, జకీర్ అహ్మద్- ముసీరాబాద్. హైదరాబాద్,
రాయబారపు సుభాషిని- గోపాల్ పూర్ కాలని హన్మకొండ, నాగరాజు (28) గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలిలు ఉండగా మరో ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు..
ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి ఈటల..
ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి ఈటల రాజేందర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై దిగ్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ అతివేగమే కారణమని మంత్రి తెలిపారు. అవసరమైతే క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు అవసరమైన ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ దిగ్భాంతి..
చెంజర్ల ప్రమాదం గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
————————————



