కలంకితులు పదవుల్లో ఎలా కొనసాగుతారు?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో కొనసాగుతున్న మంత్రుల్లో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఏ-4గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆమెను జూన్ 7న కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు కారణమైన 26 జీవోలను ఈ ఆరుగురు మంత్రులే జారీ చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వీరు.. రాగద్వేషాలకు, బంధుప్రీతికి అతీతంగా ఉంటామని పేర్కొన్న వీరు.. ప్రజలకు నిష్పాక్షికంగా సేవలందిస్తామని తెలిపిన వీరు ఏవో ప్రలోభాలకో.. ఎవరి పలుకుబడికో తలొగ్గి రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన సంపదను కొందరికి దోచిపెట్టజూశారు. ఫలితంగా ఆయా కార్పొరేట్ శక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. జగన్‌ను సీబీఐ అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. ఆయనంటే ముందే రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణనూ అరెస్టు చేసింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వంతు వచ్చింది. అంతకుముందే ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీట్ ఫైల్ చేసింది. వాన్‌పిక్ వ్యవహారంలో ఆయనను ఏ-5గా పేర్కొంది. ఇంకా ముగ్గురు మంత్రులపై చార్జిషీట్ ఫైల్ చేయాల్సి ఉంది. అయితే మోపిదేవి అరెస్టుతో బెంబేలెత్తిపోయిన మంత్రులు తమను ఎలాగైనా రక్షించాలంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. కళంకితులను కాపాడకుంటే తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని ఆందోళన చెందిన ముఖ్యమంత్రి వారికి సర్కారు ఖర్చులతో న్యాయసహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టిన వారికి రాష్ట్ర ఖజానా నుంచే ధన సాయం చేసి న్యాయ సహాయం అందజేయడం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి. రైలు ప్రమాదం జరిగి కొందరు ప్రాణాలు కోల్పోతే అందుకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎక్కడో జరిగిన ప్రమాదానికి ఢిల్లీలో ఉన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు ఆయన వారసత్వాన్ని ఆయన పార్టీకే చెందిన వారు పూర్తిగా విస్మరించారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకొని, దోపిడీలో భాగస్వాములై రాజ్యాధికారాన్ని దర్జాగా వెలగబెట్టడం నిజంగా దురదృష్టకరం. హోం మంత్రే 420 కేసులో ఇరుక్కుంటే ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ పరిస్థితి ఏమిటీ? అలాంటి వారిని మంత్రులుగా కొనసాగించి ఈ సర్కారు ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది. అవినీతిపరులను వేనకేసుకొచ్చి, ప్రజధనాన్ని లూటీ చేసిన, చేసేందుకు సహకరించిన వారిని అమాత్యులను కొనసాగించడం అంటే రాష్ట్రం ఎటు పోతుందనుకోవాలి. చిన్న ఆరోపణలు వస్తేనే పదవులకు రాజీనామా చేసిన దేశంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టిన వారిని కాపాడటం, వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకపోవడం మనలను ఏ తీరాలకు చేరుస్తుంది. ప్రభుత్వంలో కొనసాగే వ్యక్తులు సచ్చీలురై ఉంటనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది. రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన వారు రాజ్యాంగేతర శక్తులతో చేయి కలిపితే తలెత్తే విపరిణామాలకు బాధ్యులెవరు? ఓట్లేసిన ప్రజలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఏ పార్టీ సిద్ధపడదు. ఇప్పుడు వీరిపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణ వరకూ వచ్చాయి. కొందరిపైన అయితే ఇంతదూరం రాకుండా రకరకాల శక్తులు అడ్డుపడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అదే కేంద్రంలో ఇలాంటి ఆరోపణలే వచ్చిన వారితో ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయించారు. సోనియాగాంధీ స్వయంగా ప్రధానికి చెప్పి వారికి ఉద్వాసన పలికించారు. అదే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కలంకితులు పదవుల్లో కొనసాగుకుండా చూడాలి. వారిపై మోపిన అభియోగాలు మాత్రమేనని విచారణ అనంతరం తేలితేనా మళ్లీ పదవుల్లో కూర్చోబెట్టాలి. లేకుంటే అవినీతి కాంగ్రెస్ అధిష్టానానికి ప్రమేయం ఉందనుకోవడం తథ్యం.