కలువాయిలో ఉద్రిక్తత

నెల్లూరు, జూలై 10 : కలువాయి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్రాండీ షాప్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం మధ్యాహ్నం మహిళలు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రికత్తమైంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వందల సంఖ్యలు మహిళలు ఆందోళనకు దిగి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సుమారు 2లక్షల రూపాయల మేర మద్యం బాటీళ్లు ధ్వంసమైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలకు మధ్యలో మద్యం దుకాణం ఏర్పటును వ్యతిరేకిస్తూ యజమానికి వారం క్రితమే విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా మద్యం దుకాణం తెరవడం వల్ల ప్రత్యక్ష చర్యకు దిగాల్సి వచ్చిందని మహిళలు అన్నారు. ఇలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో లక్షలు వెచ్చించి మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పొందిన యజమానులకు ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ముత్తుకూరు మండలంలోని గోపాలపురం, ముత్తుకూరులో పది రోజుల క్రితం నాలుగు మద్యం దుకాణాలను ధ్వంసం చేసి 6లక్షల రూపాయల మద్యం బాటిళ్లను కొందరు దోచుకువెళ్లారు. వారిలో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో స్వచ్ఛంద సారా వ్యతిరేక ఉద్యమం నెలకొని సంపూర్ణ మద్య నిషేదానికి దారి తియగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమం రాజకీయ కక్షల నేపథ్యంలో జరుగుతు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.