కల్తీ కల్లు, గుడుంబాను అరికట్టాలి
– కొత్త ఎక్సైజ్ పాలసీపై సీఎం కేసీఆర్ కసరత్తు
హైదరాబాద్ జులై31(జనంసాక్షి):
అక్టోబరు నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త ఎక్సైజ్ పాలసీపై సీఎం కేసీఆర్ అధికారులతో సచివాలయంలో చర్చించారు. అత్యంత ఆచరణాత్మకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పాలసీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమాలకు తావులేకుండా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను అరికట్టాలని మహిళ నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నదని ఆయన గుర్తుచేశారు. మగవాళ్లు గుడుంబాకు బానిసలై ప్రాణాలు కోల్పోవడం వల్ల మహిళలు చిన్నతనంలోనే వితంతువులుగా మారుతున్నారని సీఎం కేసీఆర్ వివరించారు.
గుడుంబాను అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తక్కువ ధర, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండటం వల్ల గుడుంబాకు బానిసలవుతున్నారని, అది ప్రాణాంతకంగా మారుతున్నదని వివరించారు. గుడుంబా తయారి విధానంలో అవలంభించే పద్దతుల వల్ల అది విషంతో సమానంగా తయారైందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 28 వేల కోట్ల వ్యయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. క్షేమంగా ఉండాల్సిన ప్రజలు గుడుంబా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను పూర్తిగా లేకుండా చేయడానికి అవలంభించాల్సిన విధానాన్ని ఖరారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన పద్ధతులపై ప్రత్యేక వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అక్రమ రవాణాను నిలవరించాలని ఆదేశించారు. ఎక్సైజ్ పోలీసులకు సివిల్ పోలీసుల నుంచి కూడా సహకారం ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. త్వరలోనే రెండు శాఖల సమన్వయ సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈత చెట్లు మాయమయ్యాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. గత పాలకుల వల్ల రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులైపారుతోందన్నారు. చెరువు కట్టల చుట్టూ పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని, దీని కోసం ఇద్దరు డీఎఫ్‌వోలను కేటాయిస్తామని ప్రకటించారు.
మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీ కల్లు వల్ల ప్రజల మానసిక పరిస్థితి దెబ్బతింటోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం ఇక్కడే తయారయ్యే విధంగా డిస్టిలరీస్ ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని రకాల కంపెనీలు, బ్రాండ్ల మద్యం ఇక్కడే తయారు కావడం వల్ల తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని సీఎం కేసీఆర్ వివరించారు.