కల్లుపై సర్కార్‌ కళ్లు తెరవాలి

C

నిజామాబాద్‌లో రసాయన కు(క)ల్లు

ముగ్గురు మృతి

పిచ్చెక్కిన రోగులతో ఆస్పత్రి కిటకిట

నేలపైనే చికిత్స

వంద మందికి పైగా దవాఖానలో చేరిన రోగులు

కల్లు మానండోయ్‌.. కండ్లు తెరవండోయ్‌ ! స్వతంత్య్ర ఉద్యమ కాలంలో గాంధీ మహాత్ముడు ఇచ్చిన నినాదం. స్వతంత్య్రం సిద్ధించి ఆరు శాతబ్దాలు దాటినా మద్యనిషేధం కోసం ”సంక్షేమ” ప్రభుత్వాలు పనిచేయడం లేదు. సరికదా చెట్ల కల్లుకు బదులు క్లోరల్‌ హైడ్రేడ్‌, క్లోరోడైౖజిక్‌ పాస్పైడ్‌, డైజిపామ్‌ వంటి విషపూరిత రసాయనాలు కలిపిన ద్రావణాన్ని కల్లుతో సీసాల్లోకి నింపి అమాయక జనానికి తాగేంచుస్తున్నారు. బడా రాజకీయ నాయకుల అండదండాలతో కల్లు కంట్రాక్టార్లు ఈ విషపు వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోనిమహబూబ్‌నగర్‌ , మెదక్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ తదితర జిల్ల్లాల్లో ఎప్పటినుంచో ఉండగా, ఎక్సైజ్‌ దాడులతో మత్తు పదార్థాలను తగ్గించడంతో నిజామాబాద్‌లో వికృత రూపం దాల్చింది.

నిజామాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి):  కల్తీ కల్లు మృతుల సంఖ్య మూడుకు చేరింది. నాలుగు రోజుల క్రితం నుంచి  నిజామాబాద్‌ జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినాయక్‌నగర్‌కు చెందిన శంకర్‌ అనే బాధితుడు సోమవారం డిశ్చార్జ్‌  అయ్యి ఇంటికి వెళ్లగానే మృతి చెందాడు. ఇంకా ఎనిమిది మండలాలకు చెందిన 80 మంది వరకు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు పెరుగుతుండటంతో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కల్తీ కల్లుపై అబ్కారీ అధికారులు దాడులు జరపడంతో కల్లు వ్యాపారులు మత్తు పదార్థాలు కలపడం తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా మత్తు మందు కలిపిన కల్లు విక్రయాలపై పట్టనట్లు వ్యవహరించిన యంత్రాంగం నిర్వాకానికి ప్రస్తుతం బాధితులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. కల్తీకల్లుపై అధికారులు ఒక్కసారిగా నిరోధించటంతో అలవాటుపడినవారి నాడీ మండల వ్యవస్థ అదుపు తప్పింది. దీంతో బాధితులు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకర రసాయనాలైన డైజోఫాం, ఆల్ఫాజ్రోలం, క్లోరల్‌హైడ్రేట్‌ కల్తీ చేసిన కల్లు తాగడానికి అలవాటుపడిన వారికి ఒక్కసారిగా వీటి లభ్యత లేకపోవటం విపరీత అనర్థాలకు దారితీస్తోందని సమాచారం. దీనికితోడు  బాధితులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికితోడు వారి వింత ప్రవర్తన కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది. క్లలెడకు చెందిన చిన్నయ్య ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో కల్తీ కల్లు ప్రభావం ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. జిల్లా ఆసుపత్రిలో శనివారం 10 మంది బాధితులు చికిత్స నిమిత్తం చేరగా, ఆదివారం వీరి సంఖ్య ఏకంగా 70కి చేరడం సమస్య తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.  జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య గణనీయంగా ఉంది. మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలిపిన కల్లును సుదీర్ఘ కాలం నుంచి తీసుకోవడంతో ప్రస్తుతం చికిత్సకు వీరి శరీరం స్పందించడం లేదని నగరానికి చెందిన ఒక ప్రైవేటు వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఇస్తున్న ఔషధాల మోతాదు వీరికి సరిపోవడం లేదని, ఇచ్చిన నాలుగు గంటలకు బాధితులు నిద్రపోతున్నారని, అప్పటి వరకూ పిచ్చిగా ప్రవరిస్తూ వైద్య సిబ్బందిని హడలగొడుతున్నారని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో పలువురు చికిత్సకు నోచుకోక ఔషధ దుకాణాల్లో లభించే మత్తు మాత్రలను తెచ్చుకుని కల్లులో కలుపుకుని తాగుతున్నారు. కొందరు వీటిని మింగి ఉపశమనం పొందుతున్నారు. ఇది మరింత ప్రమాదమని చెబుతున్నారు.  వీరు చికిత్స పొందుతున్న వార్డులో వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నారు. బాధితుల పిచ్చిచేష్టలు, దుర్భాషలాడటాన్ని భరించలేక వీరు బెదిరిపోతున్నారు.