కల్వకుర్తి అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి
-పాలమూరు పోరాట సమితితో చరిత్ర సృష్టించాం
-ఎన్టీఆర్ ను ఓడించి రికార్డు నెలకొల్పాను
-కల్వకుర్తి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తా
-మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
నాగర్ కర్నూల్ బ్యూరో జులై14జనం సాక్షి :
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలు, కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి రావలసిన అవసరం ఉందని కల్వకుర్తి ప్రాంత అభివృద్దే ధ్యేయంగా భవిష్యత్తులో కృత నిశ్చయంతో పని చేయనున్నట్లు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. కల్వకుర్తిలోని యుటిఎఫ్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నప్పటికీ, అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మెడికల్, ఇంజనీరింగ్, వ్యవసాయ, వెటర్నరీ, మహిళ డిగ్రీ తదితర కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలో బస్టాండ్, బస్ డిపో, కల్వకుర్తి నాగర్ కర్నూల్ మధ్య ఉన్న సుద్దకల్ బ్రిడ్జి నిర్మాణం, 220 కెవి సబ్ స్టేషన్, ఐటిఐ తదితర విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికంగా నేతలు అడిగే అన్నింటిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గం జిల్లాల ఏర్పాటులో భాగంగా కుక్కలు చింపిన విస్తరిలా రంగారెడ్డి జిల్లాలో కర్తాల్ , మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్ మండలాలు కలవగా, కల్వకుర్తి , వెల్దండ మండలాలు మాత్రం నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో పాటు కల్వకుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో అనేక మందికి ఉపాధి లభించేదని, అయితే కల్వకుర్తిలోని సగం మండలాలు రంగారెడ్డిలోకి వెళ్లడంతో ప్రత్యేకంగా ఆమనగలులో కోర్టు ఏర్పాటు, సబ్ రిజిస్టర్ కార్యాలయం తదితర వాటిని ఏర్పాటు చేస్తూ కల్వకుర్తి రెవిన్యూ కోల్పోవడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కల్వకుర్తిని అద్దంలా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ ఇసుమంతైన పని చేయలేదని పేర్కొన్నారు. కల్వకుర్తిలో అబ్దుల్ ఖాదర్ అనే వ్యాపారస్తునికి లాభం చేకూర్చేందుకు కల్వకుర్తి ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు రాకుండా అడ్డుకున్న ఘనత జైపాల్ రెడ్డిది అని తెలిపారు. అయితే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కల్వకుర్తికి ఆర్టీసీ బస్సులు తీసుకురావడంతో పాటు అబ్దుల్ ఖాదర్ సర్వీసులన్నింటినీ పూర్తిగా రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేయడం జరిగిందని, భవిష్యత్తులోను అదే పంతాలో కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మల్లు అనంత రాములు స్ఫూర్తితో, మహేంద్ర నాథ్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కల్వకుర్తిని జిల్లాగా మార్చాలని తాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే, కొంతమంది నాయకులు నవ్వుకున్నారని అయితే తనతో అందరూ ఈ ప్రాంత నాయకులు కలిసి వచ్చుంటే ఖచ్చితంగా కల్వకుర్తి జిల్లా కేంద్రం కావడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం లోని మండలాలు రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లేవి కావని తెలిపారు. ఇప్పటికే కల్వకుర్తిలోని మేజర్ గా మండలాలను రంగారెడ్డి లో కలిపిన అధికారులు, ఇలాగే చూస్తూ కూర్చుంటే కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రాన్ని తొలగించి ఆమనగల్ లేదా ఇతర కేంద్రాన్ని నియోజకవర్గంగా ప్రకటించే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు అత్యంత అద్వాన్నంగా ఉందని, విద్యా వ్యవస్థ లో చాలా లోపాలు ఉన్నాయని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తన హయాంలోనే గవర్నర్ ప్రసంగంలో ప్రవేశపెట్టడం జరిగిందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పునాదులు వేయడంతో పాటు, జలయజ్ఞంలో భాగంగా వైయస్ అద్వితీయంగా ప్రాజెక్టు పనులకు జీవం పోయడం జరిగిందని, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులు చురుగ్గా కొనసాగాయని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రస్తుతం భూ దందాలు, అవినీతి, అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ గుండాల్లాగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ప్లాట్లను, పొలాలను ఆక్రమించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాంతం అంటే శాంతియుత ప్రాంతమని ఇలాంటి ప్రాంతంలో సైతం అక్రమార్కులు చొరబడి భూ ఆక్రమణలు చేయడం కలచివేస్తుందన్నారు. వనపర్తి తదితర నియోజకవర్గ కేంద్రాలకు ఆ ప్రాంతంలోని నేతలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని, విద్యాసంస్థలు నిర్మిస్తున్నారని తెలిపారు. అయితే కల్వకుర్తి ప్రాంతానికి మాత్రం ఏ ఒక్కటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నూతనంగా రాకపోవడం గమనార్హం అని తెలిపారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే సామెతను గుర్తు చేసుకుంటూ కల్వకుర్తిలోని విద్యావంతులు, మేధావులంతా కలిసికట్టుగా కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో కలిసి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, సర్పంచ్ లు వెంకటేష్ గౌడ్, జంగయ్య, మాజీ జెడ్పిటిసి బాలస్వామి గౌడ్, జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, స్వర్ణభారతి కళా నిలయం నిర్వాహకులు మోహన్ చారి, జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, గోపాల్, రామాంజనేయులు, అంజి, రాజేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ….
కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ అధ్యక్షునిగా యాచారం వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎముక జంగయ్య, కార్యదర్శిగా సదానందం గౌడ్, కోశాధికారిగా బాలస్వామి గౌడ్ తదితరులను ఎన్నుకున్నారు. సంపూర్ణ కమిటీని త్వరలో నియమించనున్నట్లు చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు