దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
` గళం విప్పితే జైళ్లో పెడుతున్నారు:రాహుల్
` భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని వెల్లడి
భోపాల్(జనంసాక్షి): దేశంలో దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని రాహుల్ అన్నారు. భాజపా , ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో స్వాతంత్య్రం పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మహులో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నాటి పరిస్థితులను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ మళ్లీ కోరుకుంటున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నాయి. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ దేశ విద్యా వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ‘‘ప్రైవేటు వ్యవస్థలో విద్య, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది..? మన భారత విద్యా రంగం స్టాంపులు, సర్టిఫికేట్ల వ్యవస్థగా మారింది. సర్టిఫికేట్లు వస్తే.. ఉద్యోగాలు వస్తాయని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. అలా చేస్తే విూ పిల్లలు దేశంలో ఎలాంటి ఉపాధి పొందలేరు. ఈ బిలియనీర్లు దేశ ఉపాధి వ్యవస్థను నాశనం చేస్తున్నారు’’ అని ఆరోపించారు.
మరోవైపు, ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ‘‘ప్రస్తుతం హస్తం పార్టీని తప్పుపడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతలు స్వాతంత్య్రం కోసం ఎటువంటి పోరాటం కూడా చేయలేదు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.