కళంకితులపై ఎందుకంత ప్రేమ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రివర్గంలో ఐదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వివిధ రకాల అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్ట్‌ అయి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. జగన్‌ సంస్థల్లోకి అక్రమంగా వచ్చిన పెట్టుబడులకు రాజశేఖరరెడ్డి కేబినెట్‌లోని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య జారీ చేసిన 26 జీవోలనే కారణమని ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు జీవోలు జారీ చేసిన మంత్రులపైనా విచారణ జరపాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈక్రమంలో జగన్‌ కన్నా ముందే మోపిదేవి వెంకటరమణను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఏడాదిగా మోపిదేవి జైల్లోనే ఉన్నాడు. ఆయనతో పాటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రులు మాత్రం దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన జగతి పబ్లికేషన్స్‌, భారతీ, రఘురాం సిమెంట్స్‌ తదితర కంపెనీల్లో వివిధ వర్గాలు సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించి అక్రమంగా పెట్టుబడి పెట్టాయనేది ప్రధాన ఆరోపణ. ఆయా సూట్‌కేస్‌ కంపెనీలకు మేళ్లు కలిగించేలా వైఎస్సార్‌ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రులు జీవోలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరి ఒత్తిడి ఉన్నా జీవోలు జారీ చేసిన మంత్రులు విచారణను ఎదుర్కోకతప్పని పరిస్థితి తలెత్తింది. అయినా మంత్రులెవరూ పదవులను వదులుకోలేదు. తామేమి తప్పు చేయలేదని, నిష్పక్షపాతంగానే జీవోలు జారీ చేశామని, తెరవెనుక ఏవైనా జరిగితే తమదెలా బాధ్యత అంటూ ఎదురుదాడికి దిగారు.
తెరచాటు వ్యవహారాలతో లబ్ధి పొందింది జగనే కాబట్టి ఆయనొక్కడే శిక్ష అనుభవించాలని మంత్రులు చెప్పుకొచ్చారు. ప్రస్తుత కేబినెట్‌ మంత్రులు వీరి మాటలనే వల్లెవేశారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఎదురుదాడికి దిగడమే తప్ప జరిగిన వ్యవహారంలో తమ పాత్ర, ప్రమేయం ఉందని అంగీకరించలేదు. మోపిదేవి అరెస్టుతో బెంబేలెత్తిపోయిన మంత్రులు అధిష్టానం ఎదుట మోకరిల్లి తమను కాపాడమని వేడుకున్నారు. అయితే జగన్‌ అక్రమాస్తుల కేసులోనే అరెస్టయి జైల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మాత్రం సబితా ఇంద్రారెడ్డి చెబితేనే తాను జీవో జారీ చేశానని, ఆమెను బయటే ఉంచి తనను మాత్రమే అరెస్టు చేశారని వాపోయింది. అయినా సబితా ఇంద్రారెడ్డి పదవిని మాత్రం వదులకోలేదు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఓ హోం శాఖ మంత్రి 420 తదితర సెక్షన్ల ప్రకారం విచారణ ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ చూసే హోం మంత్రే బోనెక్కక తప్పని పరిస్థితి నెలకొంది. అయినా ఆమెను, ఆమెలాగే అవినీతి మకిలీ అంటుకున్న మిగతా మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోంది. వారికి అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని ప్రచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం చట్టం ముందు పౌరులందరూ సమానం. మంత్రులైతే ఒకలాగ, సామాన్యులను ఒకలాగ చూడాలని చట్టంలో లేదు. కానీ మంత్రులపై తీవ్రస్థాయి అభియోగాలు నమోదు చేసినా వారు రాజ్యపాలన సాగిస్తుండటం విచారకరం. ఇక్కడ మంత్రుల వద్దకే వస్తే మోపిదేవికి ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది. ఫస్ట్‌ వికెట్‌గా అరెస్ట్‌ అయిన మోపిదేవి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయనకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలిచే ప్రయత్నమే చేయలేదు. అరెస్టు అయిన రోజు తప్ప ఆయన పేరు ప్రస్తావించిన సహచరులు లేరు. జగన్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఐదుగురు మంత్రులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందిస్తోంది. ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు జీవోలు జారీ చేసిన వారికి మళ్లీ ప్రజల సొమ్ము ఖర్చు చేసి కేసు నుంచి బయట పడేసేందుకు రాష్ట్రం నిస్సిగ్గు చర్యలకు ఉపక్రమించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రుల వ్యవహారంలో విడతల వారీ చర్యలకు దిగుతోందా అనే అనుమానం మోపిదేవి, మిగతా మంత్రుల ఎపిసోడ్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనేది కేవలం ఎన్నికల సందర్భంలోనో, బహిరంగ సభల్లోనో మాట్లాడే మాటగానే మిగిలింది. అదే సామాన్యుడు చిన్న తప్పు చేస్తే అరెస్టు చేసి జైలు ఊచలు లెక్కపెట్టించే వ్యవస్థ మంత్రులను మాత్రం ఉపేక్షిస్తోంది. మంత్రి అంటే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి అతీతులు అన్నట్లుగా ఈ పాలన వ్యవస్థ వ్యవహరిస్తోంది. కళంకితులను కాపాడేందుకు అధికారాన్ని అడ్డువేసింది. ప్రజాధనాన్నే ఈ అక్రమ కార్యానికి వినియోగిస్తోంది. ఈ పాలకుల తీరులో మార్పు రావడం కష్టమే. ప్రజల్లోనే మార్పు రావాల్సి ఉంది.