కళ్లముందే అభివృద్ధి ఉంది
– పనితీరును చూసి టీఆర్‌ఎస్‌ను ఆదరించండి
– ప్రాదేశికంలో పల్లెపల్లె టీఆర్‌ఎస్ జెండా ఎగరాలి
– ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, మే4(జనంసాక్షి) : పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఐదేళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కళ్లముందే అభివృద్ధి కనిపిస్తుందని, పనితీరును చూసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మంత్రి కోరారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. హన్వాడ మండలంలో కొత్తపేట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం అదే మండలంలోని టంకెర గ్రామంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించి బీడు భూ ములను సాగులోకి తెచ్చారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని, వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రా జెక్టుల పనులను వేగవం తం చేస్తున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రాజెక్టులను నిర్మించి బీ డు భూములను సాగులోకి తెస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమపథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా మారాయని అన్నారు. నిరుపేదల కళ్లల్లో ఆనందం చూడటమే కేసీఆర్ లక్ష్యమన్నారు. పోరాటాలు, త్యాగాల పునాదుల విూద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సమూలంగా మార్చే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు చూసి కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.