క(ళ్లు)ల రాజకీయాలు
కులం పురివిప్పి నాట్యమాడుతోంది తెలంగాణ ఓటు రాజకీయాల్లో. దేశంలోనూ దీనికి భిన్నమైన పరిస్థితులేమీ లేవు. పూలే, అంబేద్కర్ కలలు కన్న కులం, మతం లేని భారతదేశ రాజకీయాలు, సమాజం ఇప్పట్లో సాక్షాత్కరించే పరిస్థితులు కానరావడం లేదు. ఇప్పటివరకూ జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో అధికారం అడుగుతున్నాం కానీ పార్టీల ఎజెండాలో మాత్రం కుల నిర్మూలన ఏ పార్టీలో లేదు. అంబేద్కర్ ఏర్పాటు చేసిన లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా కుల నిర్మూలన ఎజెండాగా, విద్య అనే అంశం ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. విద్యను అందరికీ చేరువ చేసేందుకు వసతి గృహాల ఏర్పాటు, భూమిని జాతీయం చేయడం, వ్యవసాయ సంబంధమైన కో ఆపరేటివ్ పరిశ్రమల ఏర్పాటు, జ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయాల ఏర్పాటు, పత్రికలు తదితర అంశాలను ఎజెండాలో చేర్చారు. కాంగ్రెస్ పార్టీకి కుల నిర్మూలనపై చిత్తశుద్ధి లేదని, ఉంటే పార్టీ కార్యకర్తలందరూ ఖద్దరు చొక్కాలు వేసుకోవాలనే నిబంధన పెట్టినట్లు ఎవరైనా కులాన్ని పాటిస్తే (ఇంట్లోకాని, బయటకాని) వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించట్లేదని ప్రశ్నించారు. మీ చొక్కాలు ఎంత తెల్లగా ఉన్నాయో.. మనసులు అంత మురికిగా ఉన్నాయని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ మాటలు ఇప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకూ కులం, మతం, లింగం గురించిన ప్రస్తావన లేదు. అందరిదీ ఒక్కటే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ మధ్య టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ఒక టీవీ షోలో మాట్లాడిన మాటలు రాజకీయాల బట్టలు విప్పి నగ్నంగా ప్రజల ఎదుట నిలబెడుతున్నాయి. ‘నేను వెలమే, హరీశ్‌రావు, కవిత, కేటీఆర్ వెలమే.. అయినా నన్నే ఎందుకు సస్పెండ్ చేశారు’ అంటూ ప్రశ్నించాడు. అలాగే నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిలందరినీ రెడ్లకే ఇచ్చారని ప్రజలు బహాటంగా అసంతృప్తి వెళ్లగక్కారు. దీనిపై ప్రశ్నించిన ప్రతి కార్యకర్తలపై జగదీశ్వర్‌రెడ్డి వర్గీయుల జులుం మీడియాలో చూస్తూనే ఉన్నాం. దీనికి కొనసాగింపుగా తాను వెలమే కాబట్టి కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు రఘునందన్‌రావు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్‌కు వెలమ అనే అవగాహనో, కుల అవగాహనో ఉండి ఉంటే పార్టీ నుంచి కుమారుడినో, అల్లుడినో, కుమార్తెనో, ఇతర బంధువులనో తీసివేస్తే చరిత్రలో నిలిచిపోయేవారు. ఇక డబ్బులు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారన్న సంగతి మాట్లాడుకోకపోవడమే మంచిది. అలా డబ్బులు తీసుకోని వారు ఎవరైనా ఉంటే వారికి రెండు చేతులెత్తి దండం పెడదాం. కోట్లు కుమ్మరించి ఓట్ల రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల మీద ప్రేమతోనో లేక సమాజాన్ని ఉద్దరించాలనో కాదు. ఇప్పుడు రాజకీయాల్లో లేకుంటే వ్యాపారాలు చేసుకోలేం అన్న భావన ప్రబలమైంది. ఇక డబ్బుల విషయానికి వస్తే ఎవరు ఎంత తీసుకున్నారన్నది వారి వారి కులాలను బట్టి, స్తోమతను బట్టి ఉంటుంది.
మరోవైపు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగ నాయకులకు ఎస్సీ వర్గీకరణ ఆశచూపి దగ్గరతీసుకుంటున్నారని తెలిసిపోతుంది. ఇక మాలలు కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంట్లు. బీసీలు ఇప్పుడిప్పుడే తమకు కావాల్సిన వాటిని అడిగి తీసుకుంటున్నారు. ఇవ్వాల అంతో ఇంతో బాబు బలంగా ఉన్నారంటే బీసీలే కారణం అన్నది వాస్తవం. ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. కులం గురించి మాట్లాడితే కులం వాదులం, మతం గురించి మాట్లాడితే మతం వాదులం. ఇంకా స్త్రీలు, మైనార్టీల గురించి మాట్లాడే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఆదివాసీలు అసలు జాడకే రావట్లేదు. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని ఆ కాస్త రిజర్వేషన్ లేకపోతే నామమాత్రం సీట్లు కూడా ఈ వర్గాలకి వచ్చేవి కావు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని కేసీఆర్ వాగ్దానం చేస్తారు కానీ ఈ దేశంలో దళితులు ఆ పరిస్థితి కోరుకోవడం లేదు. దశబ్దాలుగా అగ్రకులాలు ఏలుతున్న ఈ ప్రాంతాన్ని, దేశాన్ని ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, మైనార్టీలు ఎలుకునే అవకాశం ఇవ్వండి అని నినదిస్తున్నారు.
అంతో ఇంతో మాయావతి, ములాయంసింగ్ యాదవ్‌లాంటి వాళ్లు యూపీలో అగ్రకులాల చేతిలో ఉన్న నాయకత్వాన్ని తీసుకున్నారని సంతోషించే లోపలే ఈ ఇద్దరూ బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతూ తాము నిర్మించుకున్న సిద్ధాంతాలనే కూల్చివేసుకుంటున్నారు. ములాయం బ్రాహ్మణులకు దగ్గరయినంతగా మాయవతి కాలేకపోతున్నారని బహిర్గతమవుతోంది. కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ దక్షిణ భారతంలో మరోప్రాంతంలో పట్టు సాధించాలని తహతహలాడుతుంది. తెలంగాణను అడ్డం పెట్టుకొని కర్ణాటకలో కోల్పోయిన ప్రాభవాన్ని నిలుపుకోవాలని చూస్తుంది. వెలమలకు టీఆర్‌ఎస్ పార్టీ ఉండనే ఉంది. బీజేపీ జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతు పలుకుతున్నా ఆ పార్టీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు, సెక్యులర్లు ఆ పార్టీకి దూరమవచ్చు. బీజేపీ హిందుత్వ పార్టీ, దేశంలో మెజార్టీ హిందువులు ఉండొచ్చు కానీ హిందూ రాజ్యం మాత్రం కాదు అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఇదే సమయంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే డాక్టర్ వినయ్‌కుమార్ నేతృత్వంలో సామాజిక ఐక్య వేదిక, విశారదన్ ఆధ్వర్యంలో నడుస్తున్న దళితశక్తి, రావేలా కిశోర్‌బాబు ఆధ్వర్యంలో కాన్షిరాం ఫౌండేషన్, ఉసా నాయకులుగా ఉన్న సామాజిక తెలంగాణ వంటి శక్తులు తెలంగాణలో దళిత, బహుజనులకే రాజ్యాధికారం అనే చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ముస్లింలు జమాతే ఇస్లామి హింద్, తదితర వేదికలపై నుంచి తమ గొంతును వినిపిస్తూ హక్కులు పొందాలనుకుంటున్నారు. ఇప్పుడున్న అగ్రకుల పార్టీలన్నీ బీజేపీ లాగే హిందుత్వ రంగు బయటపెట్టకపోయినా, లో లోపల యజ్ఞాలు, యాగాలు చేస్తూ హిందుత్వాన్ని బలంగానే చాటుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ఉన్న ప్రజలు గొర్రెలు అనే సామెత మార్చుకోవాల్సిన సందర్భం. ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మందుపోసినా తమను ఎక్కువ కాలం మోసం చేయలేరని తెలుసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ, జగన్ కథ శరణార్థుల శిబిరం లాగా తయారైందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడా సీటు దొరకని వారు, ఆయా పార్టీల్లో బహిష్కృతులకు అడ్డాగా ఆ పార్టీ తయారైంది. ఆ పార్టీ ఇప్పటివరకూ తెలంగాణపై స్పష్టమైన వైఖరితో లేదు కాబట్టి ఇక్కడ బతికి బట్టకట్టడం ఇప్పట్లో అసాధ్యం.
ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలకి, తెలంగాణ రాజకీయాలకి తేడా ఉంది. ఇక్కడ దళిత బహుజన కులాల ఆధిఖ్యత, ముస్లింల ఓటు శాతం ఎక్కువ కాబట్టి వీరందరినీ కూడగట్టుకొని పోయే రాజకీయాలే కలకాలం ఉంటాయి. చాలా మందికి ఒక అపోహ ఉంది. కింది కులాల వారికి, ముస్లింలకి, ఆదివాసీలకి రాజ్యం, రాజకీయాలు నడపడం చేతకాదని. కానీ వారే ఇప్పుడు దేశ, రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తున్నారు. వారు నిర్మించుకున్న పార్టీల ద్వారానే అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. రాహుల్‌గాంధీ నాయకుల నోళ్లు మూయించడమే కాదు యూపీఏ ఎజెండాలో తెలంగాణ లేకుండా చేశారని తెలుస్తుంది. అసలు మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకున్నా కూడా తెలంగాణ తెస్తారా అన్న అనుమానాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. తెలంగాణలో కూడా కుటుంబ రాజకీయాలు చొరబడటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచే నలుగురు వ్యక్తులు అధికారంలోకి వస్తే వారు ఏవిధంగా ప్రజలకు నచ్చచెపుతారో చూడాలి. విద్యార్థులు, కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేస్తున్న నేలలో తమ పదవులను త్యాగం చేయడం పెద్ద కష్టమైన పనికాదు. ఇది నాయకత్వం ఆలోచించితే బాగుంటుంది. అలాగే రఘునందన్ లాంటి వ్యక్తులను తీసివేసే ముందు వారికి చెప్పి, పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే వారు బయటికి వచ్చి నానా హంగామా చేయడం, ఆంధ్రా మీడియాకు పండుగగా ఉండటమే కాకుండా కొన్ని విషయాలు ప్రజలని కలచివేస్తాయి. అవి నిజాలు అయినా కూడా. తెలంగాణలో కుల, వర్గ, మత సమీకరణాలు మాత్రం చూసుకోకుండా ఈ పార్టీ ముందుకుపోలేదన్నది వాస్తవం. ఇంకా హిందుత్వ రంగు పులుముకొని పైకి సెక్యులర్‌గా కనపడినా తమకు తాము నష్టం చేసుకున్నట్టే.
– సుజాత సూరేపల్లి,
ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ రచయితల వేదిక.