కాంగ్రెస్‌పోరుబాట
` నేటినుంచి జిల్లాల్లో కాంగ్రెస్ బృందాల పర్యటన`
ధాన్యం కొనుగోళ్లు లేక రోడ్డున పడ్డ రైతాంగం
` కామారెడ్డిలో రైతు మరణం బాధాకరం`
ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొదించామన్న
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్,నవంబరు 6(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులంతా రోడ్ల విూద ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం అమ్ముకోలేక రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధాకరమన్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై కార్యాచరణ చేశామన్నారు. ఈ మేరకు ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. రైతులు వరి పండిస్తే ఉరి తీస్తామని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ధాన్యం కొనం అనేంత దుర్మార్గం ఇంకోటి ఉండదన్నారు. చివరి గింజ వరకు సర్కార్ ధాన్యం కొనాల్సిందేనన్నారు. ఎన్నికలు ముగియగానే హుజురాబాద్‌లో దళితబంధు ఇస్తానన్నా కేసీఆర్ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు. ఎందుకు ఇలాంటి హావిూలుఇచ్చి దళితులను మోసం చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందిం చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధాన్యం అమ్ముకోలేక అన్నదాత వడ్ల కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నా ప్రభత్వానికి చీమ కుట్టిన్లటైనా లేదన్నారు. ఈ విషయంపై శనివారం ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.. ’అయ్య కేసీఆరేమో రైతు పక్షపాతట. కొడుకు కేటీఆరేమో సాంకేతిక నిపుణుడట. కానీ, ధాన్యం అమ్ముకోలేక వడ్ల కుప్పల పై రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. ధరణి సమస్యల వలయంలో చిక్కి ఎకరం, అరెకరం అమ్ముకోలేక అన్నదాతలు ఉసురు తీసుకుంటున్నారు. ఇది ఆ ఇద్దరి పాపం కాదా!?’ అంటూ ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప విూద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి. తర్వాత మృతడి కొడుకుతో మాట్లాడిన రేవంత్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు అధైర్య పడవద్దు అని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ దొంగలుగా మారాయని దుయ్యబట్టారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలిచ్చి సీఎం కేసీఆర్ కొనాలనుకున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇదిలావుంటే వ్యవసాయం సంక్షోభంలో ఉందని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వేరుగా ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రైతు పండిరచించిన ప్రతీ గింజను కొంటామని సీఎం కేసీఆర్ అన్నారని, ఎక్కడ కొనుగోలు జరగడం లేదని, ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని తప్పుబట్టారు. నల్గొండ, మిర్యాలగూడలో టోకెన్ తీసుకొని కోత చేసుకోవాల్సి వస్తోందన్నారు. నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ లో రేపు కాంగ్రెస్ బృందాలు పర్యటిస్తాయని, రైతు సమస్యలు తెలుసుకోవడానికి 4 బృందాలు వెళుతాయని తెలిపారు. రైతులు, మార్కెట్ కమిటీలు, మిల్లర్లతో మాట్లాడతామని తెలిపారు. రిపోర్ట్ తయారు చేసి పీసీసీ నేతృత్వంలో వ్యవసాయ కమిషనర్‌కు అందిస్తామని పేర్కొన్నారు. రైతులను నియంత్రిస్తే ఊరుకోరమని, రబీ పంటను కూడా కొనాల్సిందేనని తేల్చిచెప్పారు. ఖల్లాల్లో రైతులకు వసతులు ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.