కాంగ్రెస్ తేల్చేసింది తేల్చుకోవాల్సింది ప్రజలే..
తెలంగాణ ఇవ్వబోమని దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. ఆ పార్టీ సీమాంధ్ర నేతల మాదిరిగానే జాతీయ నేతలు అప్పుడప్పుడు వల్లెవేసే ప్రకటనలు నిజమేనని తేలిపోయింది. ఇద్దరు పార్లమెంట్ సభ్యులను వదులుకోవడానికి సిద్ధపడిరదే కాని తెలంగాణపై ప్రకటన చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చొరవ చూపలేదు. పై పెచ్చు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే స్థాయిలో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ అంటే ఎన్నికల్లో గెలిచేందుకే పార్టీ వీడుతున్నారని మరొకరన్నారు. కన్నతల్లి పార్టీకి ఎంపీలు ద్రోహం చేస్తున్నారని మరో నాయకుడు వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ జీవితాన్ని ఇవ్వొచ్చేమో కాని ప్రజాప్రతినిధులు గెలిపించింది మాత్రం తెలంగాణ ప్రజలే. ఈ విషయాన్ని విస్మరించి ఇంట్లో కూర్చున్న వారిని రాత్రికి రాత్రే ప్రజాప్రతినిధులుగా మార్చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏ ప్రాంత నాయకులైన ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకోవాలి. ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనే నానుడికి కాలక్రమేణ కాలం చెల్లుతోంది. ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా అధికారపార్టీ నాయకులు ప్రభువులుగా చెలామణీ అవుతుండగా ప్రజలు పాలితులు, పీడితులుగా మారుతున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వారి ఆకాంక్షలకు విలువలేకుండా పోయింది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న తరతరాల మోసాల పరంపర కొనసాగుతోంది. ఇందిరాగాంధీ వారసత్వాన్ని ఆమె కోడలు సోనియాగాంధీ, మనవడు రాహుల్‌గాంధీ కొనసాగించేందుకే సుముఖంగా ఉన్నట్టు స్పష్టమైంది. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న వాయిదాల పరంపరకు స్వస్తి పలికి త్వరగా తేల్చాలని ముగ్గురు ఎంపీలు కోరినా కనీసం స్పందించలేదు. వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు మందా జగన్నాథం, జి. వివేకానంద, సిరిసిల్ల రాజయ్య సహా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అధిష్టానానికి డెడ్‌లైన్ విధించినా పట్టించుకున్న నాథుడు లేడు. కనీసం వారితో చర్చలు జరిపేందుకు కూడా తీరిక లేనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డెడ్‌లైన్లకు లొంగం ఏం చేసుకుంటారో చేసుకోండని అధిష్టానవర్గంలోని ఒకరిద్దరు నేతలు వ్యాఖ్యానించారంటే వారికి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. కాంగ్రెస్ ఇక్కడ అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. తెలంగాణ ఏర్పాటు తమ ఎజెండాలో లేనే లేదన్నట్లుగా వ్యవహరించింది. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో చేసిన 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నుంచి పూర్తిగా దూరం జరిగినట్లు స్పష్టమైంది. సీమాంధ్ర పెట్టుబడిదారులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం పుణ్యమా అని చేసిన 2009 డిసెంబర్ 23న నాటి ప్రకటనకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌లో యథాతథ స్థితిని కొనసాగించేందుకే సుముఖంగా ఉంది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా విశ్వసించే తెలంగాణ ప్రాంత నాయకులను ఏమనాలి. వారికి ఎక్కడ అధిష్టానం స్పష్టత ఇచ్చిందో చెప్పలేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ మొదలు అధికార ప్రతినిధులు రేణుకా చౌదరి, పీసీ చాకో చేసిన వ్యాఖ్యలు నిజమేనని తేలుతోంది. యూపీఏ అజెండాలో, కాంగ్రెస్ పార్టీ అజెండాలో తెలంగాణ అంశం లేదన్నది సుస్పష్టమైంది. ఇప్పుడు భ్రమలు వీడాల్సింది తెలంగాణ ప్రజలే. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ప్రజలే ఒక నిర్ణయానికి రావాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే విశ్వాసం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ తమను, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మరికొందరు పార్టీని వీడి బయటకు వచ్చారు. ఇంకా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం వ్యక్తం చేసేవారు తెలంగాణకు అనుకూలమేనని ఎట్లా అనుకోవాలి. పదవులు ఇచ్చో, ఎర చూపో కాంగ్రెస్ పార్టీ అనేక మందిని తమ వైపునకు తిప్పుకోగలిగింది. ఇప్పుడు వారంతా చిలక పలుకులు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పట్లోగా తెలంగాణ ఇస్తుందో మాత్రం చెప్పరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేదే అయితే ఎందుకు ఇద్దరు ఎంపీలు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు పార్టీ వీడేందుకు సిద్ధపడినా ఎందుకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ రాజకీయాలను వంద శాతం ఒంట బట్టించుకుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎక్కువ సీట్లు సాధిస్తే వారితో జట్టుకట్టి తెలంగాణకు మొత్తంగానే పాతరేయొచ్చు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎంపీల రాజీనామాతో తమకు ఏమాత్రం నష్టం లేదనే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పార్టీకి సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కాంగ్రెస్ తన వైఖరేంటో తేల్చిచెప్పినప్పుడు ఇప్పుడు ప్రజల వైఖరేంటో తేలాల్సి ఉంది.