కాంగ్రెస్‌ పార్టీ మాటలు ఎలా నమ్మేది?

తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు నెల రోజుల్లోగా పూర్తి చేసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ చేసిన ప్రకటనను చూపి ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఎంపీలపై అనేక ఆరోపణలు గుప్పిస్తూనే సదరు నాయకులు ఇదిగో మా అధిష్టానం తెలంగాణ కోసం ఈ చర్యలు చేపడుతోందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ విషయంలో అసలే నమ్మలేని పార్టీ కాంగ్రెస్‌. 1969 నుంచి ఇప్పటి వరకూ సాగుతున్న తెలంగాణ ఉద్యమం దీనిని స్పష్టం చేస్తుంది. ఇందిరాగాంధీ మొదలు సోనియా, రాహుల్‌గాంధీ వరకూ తెలంగాణ ప్రజలను అడ్డంగా మోసగించినవారే. అదే మోసాల పరంపర గడిచిన కొద్ది రోజుల్లో తీవ్రతరమైంది. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణపై అడ్డగోలు ప్రకటనలు చేయడంలో ప్రత్యేక పేరుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా, ఏ రోటి కాడ పాడ ఆ రోటి కాడే పాడినట్లు ఆజాద్‌ తెలంగాణపై పరస్పర విభిన్న ప్రకటనలు చేసి గందోరగోళం సృష్టించడంలో సిద్ధహస్తుడు. తెలంగాణ అంశంపై ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలు ముగిసాక మరోలా మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీ పరిపాటే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటం, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వేరే పార్టీల వైపు చూస్తుండటంతో ఈ ప్రాంతంలో తమ ప్రాతినిథ్యానికి, ఆధిపత్యానికి గండి పడుతుందని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ఆజాద్‌తో ఇలాంటి ప్రకటన చేయించింది. ఆజాద్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడిరచినా అది కాంగ్రెస్‌ పార్టీ వైఖరే. ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకున్నా ఇద్దరు ఎంపీలు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన నేపథ్యంలో ఆయన స్పందించక తప్పని పరిస్థితి. అయితే ఆజాద్‌ తెలంగాణపై చేసిన ప్రతి ప్రకటన ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని కొలిక్కి తెస్తుందని అనుకోవడం అత్యాశే. అదే నిజమైతే కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ నిజమై ఉండేవి. 1969లో ఉద్యమ హోరుతో 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎజెండాగా పోటీ పడ్డ తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్‌) పది స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ పార్టీ కొన్నాళ్లకే కాంగ్రెస్‌లో విలీనమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం 2009లో తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు ఏకమై ఐక్య ఉద్యమాలు సాగించారు. ఆ ఉద్యమ ఉధృతికి దిగివచ్చిన యూపీఏ`2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత సీమాంధ్ర పెత్తందారులు, రాజకీయ నాయకులు సృష్టించిక సమైక్యాంధ్ర అనే కృత్రిమ ఉద్యమం వల్ల చేసిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల అధ్యయనం కోసమంటూ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సమస్యకు పరిష్కారం చూపకపోగా మరింత జఠిలం చేసింది. తర్వాత మొదలైన ‘మేనేజ్‌మెంట్‌’ వ్యవహారంలో గులాంనబీ ఆజాద్‌ సహా పలువురు అధిష్టానం పెద్దలు సీమాంధ్రుల లాబీలో చిక్కుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దానిని నిజం చేస్తూ పలు సందర్భాల్లో ఆయా నాయకులు తెలంగాణ వ్యతిరేకంగా, మరో అడుగు ముందుకేసి మరీ అడ్డంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన టీ కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించింది. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టతనిచ్చాయని, నెల రోజుల్లోగా పరిష్కారం చూపుతామన్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే ఆజాద్‌ నెలంటే 30 రోజులు కాదంటూ కొత్త భాష్యం చెప్పాడు. ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న వారిని కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదని, వారు పార్టీని వీడేలా చేసిందని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడం, తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆగ్రహం తెప్పించే చర్యలకు పాల్పడవద్దని కాస్త సంయమన మంత్రం ఆలపిస్తోంది. ఇందులో భాగంగానే నెలవంక ఆజాద్‌ మరో నెలంటూ కొత్త గడువు విధించాడు. మరి ఇప్పుడు నెలంటే ఎన్ని రోజులో ఎవరు చెప్పాలి. తీరా 30 రోజులు గడిచాక మళ్లీ పాత పాటే పడితే ఎంటీ పరిస్థితి. కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇలాంటి గడువులు పెట్టడం కొత్తకాదు. ఇప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తెలం‘గానం’ ఆలపించడంలో పెద్ద విశేషమేమీ లేదు. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసమే ఆ‘జాదూ’ చేశాడు. అది నిజం కావాలంటే సరిగ్గా 30 రోజుల్లో తేల్చేస్తే తప్ప కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మబోరు.