కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
– చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి
కామారెడ్డి, డిసెంబర్9(జనంసాక్షి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో కృష్ణ మందీర్ సవిూపంలో ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు లావణ్య(35), రోషిణి(14), సుశీల్(28), ప్రశాంత్(26) అక్కడికక్కడే మృతి చెందారు. కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొనడంతో కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకున్నారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయి, కారులో ఇరక్కుపోయిన మృతదేహాలను పోలీసులు గ్యాస్ కట్టర్‌తో కారు భాగాలను విడదీసి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ ప్రశాంత్ ది నిజామాబాద్ జిల్లా నవీపేట కాగా.. మిగతా ముగ్గురు నిజామాబాద్ కేంద్రంలోని పద్మానగర్‌కు చెందిన మంథని లావణ్య, రోషిణి, సుశీల్‌గా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.