కార్టునిస్టు త్రివేదీపై రాజద్రోహం కేసు ఉపసంహరణ
ముంబై, అక్టోబర్ 12 (జనంసాక్షి) : ప్రముఖ కార్టూనిస్ట్ అసీమ్ త్రివేదిపై దేశద్రోహం అభియోగాలు మోపడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆయనపై మోపిన రాజద్రోహం అభియోగాలను తొలగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు మమహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అవినీతిని నిరసిస్తూ.. అసీమ్ త్రివేది గీసిన కార్టూన్లు వివాదాస్ప దమయ్యాయి. రాజ్యాంగాన్ని జాతీయ చిహ్నాన్ని అవమానపరిచేలా కార్టూన్లు గీశారని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టింది. సెప్టెంబర్ 8న అరెస్టు చేసి, జైలుకు పంపింది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మహారాష్ట్ర సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, బాంబే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు అభియోగాలు మోపి వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేరని, త్రివేదికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సెప్టెంబర్ 12న బెయిల్‌పై విడుదల అయ్యారు. తన తప్పును తెలుసుకున్న సర్కారు.. చివరకు ఆయపై మోపిన అభియోగాలను తొలగించింది. అలాగే, రాజద్రోహం కేసు పెట్టే విషయంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్ని పోలీసుస్టేషన్లకు సర్క్యులర్ జారీ చేసింది.