కార్బన్‌మోనాక్సైడ్‌ పీల్చడం వల్లే మరణాలు అధికం..

నెల్లూరు, జూలై 30 : సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. కంపార్టుమెంట్లలోని సీట్లన్నీ రెగ్జిన్‌తో తయారు చేసి ఉండడం వల్ల మంటలు ప్రారంభం కాగానే అందులో నుంచి కార్బన్‌మోనాక్సైడ్‌ అనే విష వాయువు విడుదలై గాఢ నిద్రలో ఉన్న వారంతా సీట్లకే అతుక్కుపోయి మరణించారు. మొత్తం 72 మంది ఉన్నట్టుగా చెబుతుండగా మరో 20 మంది అదనంగా ఉన్నట్టు రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది. అంటే దాదాపు 94 మంది కంపార్టుమెంటులో ఉండగా 18 మంది మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిలో జైపూర్‌ ప్రాంతానికి సుఖదేవ్‌ (45), 85శాతం శరీరం కాలిపోగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఎం. సాంబశివరావు 90శాతం గాయాలతో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎం. సాంబశివరావు వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య చెన్నయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నిర్వహిస్తున్నారు. సుఖదేవ్‌ ఇండియన్‌ నేవీలో కీలకమైన బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెల్లూరు నగరంలోని బొల్లినేని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జైభారత్‌ ఆసుపత్రి, రామచంద్రారెడ్డి ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న వారంతా కార్బన్‌ డైఆక్సైడ్‌ విష వాయువు పీల్చి ఉండడం వల్ల నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించకపోయినట్టయితే వారు చనిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రాధమిక విచారణ : డిఆర్‌ఎం
నెల్లూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ అనురాగ్‌ తెలిపారు. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కుట్ర జరిగిందా.. లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రస్తుతం ఎంత మంది చనిపోయారు.. దానిపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన అధికారిక చార్టు ప్రకారం 72 మంది ఎస్‌-11లో ప్రయాణిస్తున్నారని, అదనంగా ఎంతమంది ఉన్నారనేది తేలాల్చి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా 10 గంటల ప్రాంతంలో దగ్ధమైన ఎస్‌-11 బోగీ నుంచి మృతదేహాల వెలికితీత ప్రారంభించారు. అయితే శవాలన్నీ కాలిపోవడం వల్ల కంపార్టుమెంటులో మాంసపు ముద్దలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరి శవాల కాళ్లు, చేతులు కనిపిస్తున్నా.. మిగిలిన భాగాలు గుర్తించలేకపోతున్నారు. ఈ సంఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పేర్లను తీసుకున్న తర్వాతే చనిపోయిన వారెందరన్నది తేలుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు చిరంజీవి, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నానానికి నెల్లూరుకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు రైల్వేస్టేషన్‌కు కేవలం అరకిలోమీటరు దూరంలో విజయమహల్‌ గేటు వద్ద దుర్ఘటన జరిగింది. విజయమహాల్‌ గేటు వద్ద రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద గేటుమెన్‌ ముందుగా మంటలు రావడాన్ని గుర్తించి రైల్వే సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. అప్పటికే రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భారీ సంఖ్యలో దహనమయ్యారు. ఢిల్లీ నుంచి వస్తున్న రైలు ఎపిలోకి ప్రవేశించగానే వర్షం పడుతుండడంతో కిటికీలు మూసి ఉంచుకున్నారని, దీనివల్ల మృతుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. తప్పించుకున్న 18 మంది పక్కబోగీలోంచి పట్టాలపైకి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.