కార్మికుల ప్రాణాలకు భద్రతేది?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత నెల బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు. ప్రపంచంలోనే అత్యంత బీద దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. ఇక్కడ పనిచేసే కూలీలు, కార్మికులకు చెల్లించేది అత్యల్ప వేతనాలే. దీనినే ఆసరాగా చేసుకొని బహుళజాతి సంస్థలు ఢాకాలోని ఎనిమిది అంతస్తుల భవనంలో వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ఆయా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించాయి. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించామని గొప్పగా చెప్పుకున్న ఎంఎన్‌సీలు, స్థానిక ప్రభుత్వం వారి భద్రతను మాత్రం గాలికొదేశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే బహుళ అంతస్తుల భవనంలో వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికుల ప్రాణాలను బలిగొన్నారు. వేలాది మంది పనిచేసే భవనంలో ఉదయం పూట ప్రమాదం జరిగింది కాబట్టి మృతుల సంఖ్య తక్కువగా ఉందని, అదే మధ్యాహ్నం జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ప్రమాదం జరిగిన రోజు ప్రకటించింది. ఆ దేశం ఎంత అవగాహన రాహిత్యంతో ఆ ప్రకటన చేసిందో కొన్ని రోజుల్లోనే తేటతెల్లమైంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్ది గుట్టలను తలపించేరీతిలో మృతదేహాల కుప్పలు కనిపించాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 831కి చేరింది. ఇంకా వందలాది మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. పారిశ్రామికరంగ చరిత్రలోనే ఈ ప్రమాదం అత్యంత ఘోరమైనది. మరే ఇతర పారిశ్రామిక ప్రమాదంలో ఇంతమంది కార్మికులు మృత్యువాత పడిన సంఘటనలు ఇంతకుముందు లేవు. ఇందరిని పొట్టనబెట్టుకున్న దుర్ఘటనపై ఒక్క అంతర్జాతీయ సంస్థ గొంతెత్తి ప్రశ్నించకపోవడం విచారం కలిగించే అంశం. 831 మంది ప్రాణాలు కోల్పోయినా ఒక్క కార్మిక హక్కుల వేదిక, ఉద్యమ సంస్థ దీనిపై ఉద్యమానికి దిగలేదు. పెద్ద దిక్కు కోల్పోయి, ఆసరా కరువై రోడ్డుపడ్డ కుటుంబాలకు అండగా నిలువలేదు. అభాగ్యులు, పొట్టకూటి కోసం రక్తాన్ని చమటగా మార్చే శ్రమ జీవులు తాము చేయని తప్పుకు బలైపోయినా దానికి బాధ్యులను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. 831 మంది ప్రాణాలు కోల్పోయినా ఆ దుర్ఘటనను అంతర్జాతీయ స్థాయి అంశంగా చేయలేదు. వెనుకబడిన దేశంలో తక్కువ వేతనానికి కూలీలు దొరుకుతాయని పరిశ్రమలు స్థాపించే బహుళజాతి సంస్థలు వారి రక్షణను గాలికొదిలేసినా స్థానిక ప్రభుత్వం కాని, ఉద్యమ వేదికలుగాని ఇదేమిటని నిలదీయలేదు. ఇంకా అలాంటి భద్రతలేని భవనాల్లో నిర్వహిస్తున్న పరిశ్రమలెన్నో ఉన్నాయి. వాటిని గురించి కూడా ప్రశ్నించే ప్రయత్నం జరగడం లేదనే చెప్పాలి. వందలాది మంది కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పరిశ్రమలు స్థాపించే సంస్థలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తూ వెన్నుతట్టి ముందుకు నడుపుతున్నాయి. కానీ ఆ సంస్థలే కార్మికుల ప్రాణాలను బలిగొన్న ఎలాంటి చర్యలకు ముందుకురావడం లేదు. ప్రభుత్వ పెద్దల్లో ఉదాసీనత కార్మికలోకానికి శాపంగా మారినప్పుడు వారి పక్షాన నిలువాల్సిన శక్తులు చేష్టలుడిగి చూస్తుండటం విచారకరం. కార్మికులు, కర్షకులు శ్రమజీవులు. ఎవరినో మోసం చేసి పొట్టనింపుకోవాలనే తత్వం ఉన్నవారు కాదు. అలాంటి వారిని విస్మరించే పాలకపక్షాలకు తర్వాతికాలంలో ఎదురుదెబ్బలు తప్పవు. పెట్టుబడిదారి పక్షపాతం వహించే పాలకులెవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి. ఆయా శక్తులు ఎవరు అధికారంలో ఉంటే వారి పంచనే చేరుతారు. కానీ ప్రజలు, సామాన్య కూలీలు, కార్మికులు అలా కాదు. తాము రెండు పూటలా తినేందుకు, గుక్కెడు నీరు తాగేందుకు, కనీసం నీడ కల్పించేందుకు ప్రయత్నించే పక్షాలను నెత్తిన పెట్టుకుంటాయి. ఆ విషయం విస్మరించే శక్తులకు ప్రజాస్వామికంగా భంగపాటు తప్పదు.