కాళేశ్వరంపై కాంగ్రెస్‌ అనవసర విమర్శలు

ప్రాజెక్ట్‌ నిర్మాణాలను పరిశీలిస్తే నిజాలు తెలుస్తాయి: ఎమ్మెల్సీ

కరీంనగర్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి వరంలాంటిదని, అయితే ఈ ప్రాజెక్టుపై విపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి అనేక రిజర్వాయర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పదహారు జిల్లాల్లో 42 లక్షల ఎకరాలకు నీటిని అందించే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ మేరకు పనులన్ని వేగవంతంగా పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ప్రతి పక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసేందుకోసం గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా, ఒడిసి పట్టుకొని రాష్ట్రంలోని కోటి ఎకరాలకు అందించే ప్రయత్నం చేస్తుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ విమర్శించారు. మేడారంలో జరుగుతున్న పనులు చూస్తే నీళ్లు వస్తయో! పోతయో అనేవిషయం తెలుస్తుందనీ అన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను చూస్తే విషయం అర్ధమవుతుందని హితవు పలికారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేలు అందజేయగా, రైతు మరణిస్తే అతని కుటుం బం రోడ్డున పడకుండా రూ. 5 లక్షల బీమా కల్పిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేయించిందని తెలిపారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్‌ను అందించి ఆసరగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు, కేసీఆర్‌ కిట్టు పంపిణీతో జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య ఎనభై శాతం పెరిగిందని తెలిపారు. పేదింటి ఆడపిల్లకు కల్యాణలక్ష్మి ద్వారా సాయం అందజేసి కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు.