కాళేశ్వరంపై నివేదిక సమర్పించిన కమిషన్‌

` నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అందజేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌
` 15 నెలల పాటు విచారణ
` కేసీఆర్‌, ఈటెల, హరీశ్‌లు సహా 115 మంది వాంగ్మూలం సేకరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు నివేదిక అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. ఇందులో కెసిఆర్‌, హరీష్‌ రావు, ఈటెల రాజేదర్‌ సహా నీటిపారుదల శాఖ అధికారులను విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్‌ నివేదికతో రాహుల్‌ బొజ్జా సచివాలయానికి బయల్దేరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు నివేదిక అందించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 ఆఖర్లో కుంగడం, పియర్స్‌ దెబ్బతినడంతో పాటు- అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2023 డిసెంబరులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం… మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, మిగిలిన బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఏర్పడటంపై విజిలెన్స్‌ విచారణతోపాటు- నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ-(ఎన్డీఎస్‌ఏ)తో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్లు- విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతోపాటు- వెంటనే కమిషన్‌ ఏర్పాటు-కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారతదేశ మొదటి లోక్‌పాల్‌గా 2019 నుంచి 2022 వరకు పనిచేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్‌ను ఏర్పాటు- చేసింది. జులై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అయితే కమిషన్‌ ఏర్పాటు- ఉత్తర్వులు జస్టిస్‌ ఘోష్‌కు ఏప్రిల్‌లో అందగా, మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతోపాటు- ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్‌ ఎగ్జామినేషన్‌, విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ నివేదికల పరిశీలన.. ఇలా పలు కారణాలతో కమిషన్‌ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఇవాళ జస్టిస్‌ పీసీ ఘోష్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.