కాళేశ్వరంలో కోల్పోయిన అడవుల కోసం హరితహారం
పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు
ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టనున్న అటవీశాఖ
కరీంనగర్,జూన్21(జనం సాక్షి): హరితహారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కోల్పోయిన అటవీ సంపదను తిరిగి సృష్టించడానికి యుద్ద ప్రతిపాదికన మొక్కలు నాటాటాలని, ఆ మేరకు పనులు మొదలు కావాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశిరచారు.కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 168 హెక్టార్ల అటవీ భూమిని సేకరించింది. పర్యావరణ నష్టనివారణ కింద 3 వేల 2 వందల హెక్టార్లకు పైగా రెవెన్యూ భూములిచ్చింది. ఈ భూములలో 2019 నుంచి 2022 సంవత్సరం వరకు మొక్కలను నాటడం పూర్తి చేయాలని అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ సిరిసిల్ల, పెద్దపల్లి, జనగామ, అచ్చంపేట, నల్లగొండ, తదితర డివిజన్ల కన్జర్వేటర్లు, డీఎఫ్‌ఓలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు. ఒక్కో మొక్క కనీసం ఒకటిన్నర విూటరు ఎత్తులో ఉండాలని అవి ఎక్కువ శాతం పండ్ల మొక్కలై ఉండాలని సూచించారు. అటు వచ్చే నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా సాగాలని అన్నారు. ఇక కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్‌ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కంపా నిధుల వినియోగంలో తెలంగాణ రికార్డును సాధించింది. కంపా నిధుల కింద రాష్ట్రం కోటాలో రూ.2025 కోట్లు జమై ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా పదిశాతం నిధులను మాత్రమే విడుదల చేస్తారు. ఇక ఈ ఏడాది రూ.225 కోట్లు రావాలి. కానీ కంపా కింద తాము లక్ష్యానికి మించి పనులు చేపడుతున్నామని.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపట్టడం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు అదనంగా మరో రూ.370 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అటు 2009 నుంచి 2017-18 వరకు కంపా కింద రాష్ట్రానికి రూ.662.37 కోట్లు విడుదలైతే.. అందులో ఇప్పటివరకు రూ.645.36 కోట్ల వరకు ఖర్చయ్యాయని అధికారులు తెలిపారు.తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం పంటకే నీరందించేలా నిర్మాణ పనుల స్పీడ్ పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అటవీ భూములు సేకరించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూములను అడవులుగా మార్చేందుకు అటవీశాఖ అధికారులు యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. మూడేండ్లలో చేయాల్సిన పనిని ఈ వానాకాలం లోనే పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అడవుల పెంపకానికి దేశంలోనే అధికంగా నిధులను వినియోగిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖను అటవీశాఖ అధికారులు కోరారు. హరిత తెలంగాణ నిర్మాణంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.